జీవితా రాజశేఖర్ దంపతుల పెద్ద కుమార్తై శివానీ రాజశేఖర్ హీరోయిన్గా ‘2 స్టేట్స్’ సినిమాతో ఎంట్రీ ఇస్తోందని అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. నిజానికి చాలా కాలం క్రితమే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా తాజాగా వివాదంలో చిక్కుకుంది. దర్శకుడికి, నిర్మాతలకు భేదాభిప్రాయాలు రావడంతో చిత్రీకరణ నిలిచిపోయిందని తేలింది. చేతన్ భగత్ రచించిన నవల 2 స్టేట్స్ ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 2 స్టేట్స్కు అఫీషియల్ రీమేక్ ఇది. అదే పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా 70 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం కథలో తనకు తెలియకుండా నిర్మాత ఎం.ఎల్.వి. సత్యనారాయణ మార్పులు చేశారని, దర్శకుడిగా తనను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని వెంకటరెడ్డి కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు నిర్మాత ఎమ్.ఎల్.వి సత్యనారాయణను ఈ నెల 30న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని కోరిందని దర్శకుడు వెంకట్ రెడ్డి ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. కేసు విచారణకు వచ్చేంతవరకూ సినిమాని తాత్కాలికంగా వాయిదా వేశారనీ తెలుస్తోంది. అయితే, ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు, నిర్మాణ భాగస్వామ్యం కూడా కలిగిన వెంకటరెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని ఆపేది లేదనీ, రీమేక్ రైట్స్‌లో తనకూ భాగం ఉందనీ అంటున్నారు. ఏమో చూడాలి మరి, శివానీ తొలి సినిమా అసలు రిలీజ్ అవుతుందో లేదో ?