ఆందోళన చెందుతున్న బాలు అభిమానులు

ఆందోళన చెందుతున్న బాలు అభిమానులు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కరోనా నుంచి కోలుకున్న ఆయనకు మళ్లీ అనారోగ్యం తిరగబెట్టింది. 40 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అనారోగ్యం తిరగబెట్టడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాసేపట్లో వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయనున్నారు.

ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆగస్టు 5నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన గాయకుడు పూర్తిగా కోలుకుని ఇవాళో, రేపు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని ఎదురు చూస్తున్న అభిమానులను తాజా వార్త కలవర పెడుతోంది. తన తండ్రి బాగానే కోలుకుంటున్నారని బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్‌ నాలుగు రోజుల క్రితమే వెల్లడించారు. రోజూ 10 నుంచి 15 నిమిషాలు ఫిజియోథెరపీ చేస్తున్నారని, ఆస్పత్రి సిబ్బంది సహాయంతో లేచి కూర్చుంటున్నారని చరణ్‌ తెలిపారు. మళ్లీ అనారోగ్యం తిరగగెట్టడంతో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పరిస్థితిపై కుటుంబ సభ్యులతో పాటు సినిమా పరిశ్రమకు చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.