గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, విపక్షనేత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు ఖలేదా జియా ను వైద్యం కోసం విదేశాలకు పంపించకపోతే.. ఆమె జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు ఆమెకు విదేశాల్లో అత్యాధునిక వైద్య చికిత్స చేయడం చాలా ముఖ్యం అని లేకుంటే జియా జీవితానికే ప్రమాదం అని తెలిపారు. ఆమెకు లివర్ సిర్రోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 2018లో అవినీతి ఆరోపణలపై దోషిగా తేలిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకురాలైన జియాను దేశం విడిచి వెళ్లకుండా కోర్టు నిషేధించింది.
గత రెండు వారాల్లో ఆమెకు మూడుసార్లు భారీ అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా జియాకు చికిత్స అందిస్తోన్న ప్రధాన వైద్యుడు ఫకృద్దీన్ మొహమ్మద్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ‘‘మా దగ్గర అత్యాధునిక వైద్య సాంకేతికత అందుబాటులో లేదు. ముఖ్యంగా రక్తస్రావాన్ని నియంత్రించడానికి, ఆపడానికి కావాల్సిన అత్యాధునిక వైద్య సదుపాయాలు మా దేశంలో లేవు’’ అని తెలిపారు.
వచ్చే వారంలో జియాకు మరో అంతర్గత రక్తస్రావం అయ్యేందుకు 50 శాతం అవకాశం ఉందని, వచ్చే ఆరు వారాల్లో 70 శాతం ఉందని సిద్ధిఖీ తెలిపారు. ఇది ఇలానే కొనసాగితే ఆమె ప్రాణాలకే ప్రమాదం అన్నారు. ‘‘జియా ప్రాణాలు కాపాడాలంటే.. అధునాతనమైన వైద్య చికిత్స ‘టిప్స్’ చేయించాలి. అది కేవలం అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అందుకే వైద్యం నిమిత్తం విదేశాలకు వెళ్లడానికి జియాకు అనుమతివ్వాలి’’ అని సిద్ధిఖీ కోరారు.
కోవిడ్ నుంచి కోలుకున్న ఐదు నెలల తర్వాత జియా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో 2021, నవంబర్ 13 నుంచి జియాను ఢాకా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో బీఎన్‌పీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆమెను చికిత్స కోసం విదేశాలకు వెళ్లడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.