మోదీపై నిరాధార ఆరోపణలు.. కేజ్రీవాల్‌,ప్రియాంకలకు ఈసీ నోటీసులు

Baseless allegations against Modi.. EC notices to Kejriwal, Priyanka
Baseless allegations against Modi.. EC notices to Kejriwal, Priyanka

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై చేసిన నిరాధారణ ఆరోపణలకు గానూ దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వరంగ సంస్థలను మోదీ సర్కారు ప్రైవేటుపరం చేసిందనీ, భెల్‌ సంస్థను పారిశ్రామిక మిత్రులకు కట్టబెట్టిందని ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రియాంకా మోదీపై నిరాధార ఆరోపణలు చేసినట్లు ఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆమె చేసినవి తప్పుడు ఆరోపణలు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గురువారం రాత్రి 8 గంటల్లో ఆమె వివరణ ఇవ్వాలంటూ ఈసీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

మరోవైపు.. పారిశ్రామికవేత్త గౌతం అదానీ, ప్రధాని మోదీల చిత్రాలతో ఒక వీడియో కథనాన్ని ఆప్‌ రూపొందించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈసీకి మరో ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. దేశప్రజల కోసం కాకుండా అదానీ కోసమే మోదీ పనిచేస్తారని సామాజిక మాధ్యమాల్లో ఆప్‌ విమర్శించిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద దీనిపై ఎందుకు చర్యలు తీసుకోరాదో ఈ నెల 16వ తేదీలోగా చెప్పాలంటూ కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.