భారత క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఓ శుభవార్త వచ్చింది. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఆటగాళ్ల మానసిక ఒత్తిడికి కారణమవుతున్న బుడగ నిబంధనలను ఎత్తి వేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుడగ నిబంధనల వల్ల ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దేశంలో కోవిడ్ ప్రభావం కూడా తగ్గుముఖం పడతుండడంతో బయో బబుల్ నిబంధనలకు పూర్తిగా స్వస్థి పలకాలని బీసీసీఐ యోచిస్తుంది. దీంతో ఈ నెల నుంచే ఆటగాళ్లకు బుడగ నిబంధనల నుంచి విముక్తి కల్పించాలని భావిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ వెసులుబాటు దేశవాళీ క్రికెటర్లకు మాత్రమేనని తెలుస్తోంది. త్వరలో రెండు దేశవాళీ టోర్నీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 18 నుంచి అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీతో పాటు సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.