రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా బీచ్ రోడ్ చేతన్. రా అండ్ రియలిస్టిక్‌గా ఈ సినిమాను రూపొందించినట్టుగా వెల్లడించారు చిత్రయూనిట్. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శక-నిర్మాత-హీరో చేతన్ మద్దినేని తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.నవంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తొలి రోజు తొలి షో ఉచితంగా ప్రదర్శించనున్నారు.
ఈ సందర్భంగా చేతన్ మాట్లాడుతూ `నవంబర్ 22న మా `బీచ్ రోడ్ చేతన్` రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్స్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచితంగా ఇస్తున్నాము. దాదాపు 200 థియేటర్స్‌లో సినిమా రిలీజ్ అవుతుంది. తొలి రోజు మార్నింగ్ షో నుండి సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తుందని ఆశిస్తున్నాను. ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో మీ ముందుకు వస్తున్నాను, టీజర్ అందరికి నచ్చింది, ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ లభిస్తోంది అన్నారు. 22న రాబోతున్న మా సినిమా మీకు నచ్చుతుందని భావిస్తున్నా` అన్నారు.
విలన్‌గా నటించిన నిర్మల్ భాను మాట్లాడుతూ.. `అందరికి కల ఉంటుంది, వాటిని సాకారం చేసుకోవాలంటే సరైన పర్సన్స్ కావాలి. చేతన్ నాకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చాడు. నేను ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించాను. ఈ చిత్రంలో నటించిన అందరూ బాగా చేశారు, అందరూ కలసి ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. చేతన్ అన్ని పాత్రలు చాలా బాగా డిజైన్ చేసాడు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను మీ అందరూ చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా` అన్నారు.