మీ ఖాతాలోంచి రూ.25వేలు డ్రా అయ్యాయి.. డ్రా చేసింది మీరు కాకుంటే.. వెంటనే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండంటూ ఓ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌కు సైబర్ నేరగాళ్లు రూ. 70 వేలు టోకరా వేశారు. అయితే.. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి డెబిట్ కార్డు వివరాలు అడిగితే.. సదరు బాధితుడు మాత్రం క్రెడిట్ కార్డు వివరాలతో పాటు ఓటీపీ కూడా చెప్పేశారు. తీరా తాను మోసపోయానంటూ సోమవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. హిమాయత్‌నగర్‌లో నివసించే ఆంధ్రా బ్యాంకు విశ్రాంత మేనేజర్ సెల్‌ఫోన్‌కు సోమవారం ఉదయం ఓ మెసేజ్ వచ్చింది. అందులో మీ బ్యాంకు ఖాతా నుంచి హఫీజ్‌పేటలో రూ.25 వేలు డ్రా అయ్యాయి.
డ్రా చేసింది మీరు కాకపోతే వెంటనే మా కస్టమర్ కేర్ నంబర్‌కు ఫిర్యాదు చేయండంటూ అందులో సారాంశం ఉంది. తాను బయటకు వెళ్లలేదని.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన ఖాతాలో నుంచి డబ్బు డ్రా చేశారంటూ హడావుడిగా అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు ఆయన ఫోన్ చేశారు. ఫోన్‌లో కార్డు.. ఖాతా వివరాలు అడిగిన సైబర్‌నేరగాళ్లు సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీని కూడా చెప్పాలని అడగడంతో దానిని కూడా చెప్పారు. అయితే సదరు బాధితుడు తన వద్ద ఉన్న క్రెడిట్ కార్డు వివరాలు చెప్పడంతో ఆ కార్డు నుంచి రూ.70 వేలు మొబిక్విక్ వ్యాలెట్‌లోకి బదిలీ చేసుకున్నారు. డబ్బు డ్రా అయినట్టు మరోసారి సెల్‌ఫోన్‌కు మేసేజ్ రావడంతో బాధితుడు సోమవారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలు చెప్పాల్సి ఉండగా.. క్రెడిట్ కార్డు వివరాలు ఎందుకు చెప్పారంటూ బాధితుడిని పోలీసులు ప్రశ్నించారు. మీ వద్ద ఉన్న కార్డు వివరాలు చెప్పండంటూ అడగడంతో క్రెడిట్ కార్డు వివరాలు కూడా చెప్పాల్సి వచ్చిందంటూ సదరు బాధితుడు పోలీసులకు వివరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌పెక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు.