కొడుకులా బాధ్యతలు నెరవేరుస్తున్న బెన్

కొడుకులా బాధ్యతలు నెరవేరుస్తున్న బెన్

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ తన తండ్రి చెప్పినందుకే ఐపీఎల్‌ ఆడేందుకు యూఏఈ వచ్చానన్నాడు. ఓ కొడుకులా తన బాధ్యతలు నెరవేరుస్తున్నట్లే క్రికెట్‌ బాధ్యతల్ని విస్మరించకూడదని తన తండ్రి తెలిపాడని స్టోక్స్‌ వివరించాడు. క్రైస్ట్‌చర్చ్‌లో ఉన్న కుటుంబసభ్యుల్ని వీడి వచ్చేందుకు మనసు రాలేదని… అయితే తండ్రి ఇచ్చిన ధైర్యం, కుటుంబ సభ్యుల తోడ్పాటుతోనే ఐపీఎల్‌ ఆడేందుకు వచ్చానని స్టోక్స్‌ పేర్కొన్నాడు.

అతని తండ్రికి బ్రెయిన్‌ క్యాన్సర్‌ అని తెలియడంతో పాక్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ మధ్యలోనే ఈ ఆల్‌రౌండర్‌ న్యూజిలాండ్‌కు బయల్దేరాడు. కొంతకాలం ఆటకు విరామమిచ్చి తల్లిదండ్రులను చూసుకున్నాడు. పరిస్థితులు కాస్త మెరుగవడంతో ఆడేందుకు వచ్చిన స్టోక్స్‌ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. ‘కివీస్‌ నుంచి రాగానే హోటల్‌ గదికే పరిమితం కావడం మొదట్లో కాస్త ఇబ్బందికరమైనా… ఇక్కడి ఏర్పాట్లు, సౌకర్యాలు చూస్తుంటే సురక్షిత ప్రాంతంలోనే ఉన్నట్లు అనిపిస్తోంది’ అని అన్నాడు. కరోనా ప్రొటోకాల్‌ ప్రకారం అతను ఈ నెల 10 దాకా బరిలోకి దిగే అవకాశం లేదని రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్మిత్‌ తెలిపాడు.