అద్భుతమైన పాత్ర పోషించిన బెన్‌స్టోక్స్

అద్భుతమైన పాత్ర పోషించిన బెన్‌స్టోక్స్

వెస్టిండీస్‌తో రెండో టెస్టును ఎలాగైనా నెగ్గి సిరీస్‌ సమం చేయాలనుకున్న ఇంగ్లండ్‌ దానిని చేసి చూపించింది.113 పరుగులతో గెలిచిన రూట్‌ సేన సిరీస్‌ను 1–1తో సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్‌ చివరి రోజు సోమవారం దూకుడైన బ్యాటింగ్‌తో 11 ఓవర్లకే డిక్లేర్‌ చేసి ప్రత్యర్థికి 85 ఓవర్లు ఆడే అవకాశం ఇచ్చి ఇంగ్లండ్‌ సవాల్‌ విసరగా… 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ తలవంచింది. దీనిలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన ఇంగ్లండ్‌ ప్లేయర్‌ బెన్‌ స్టోక్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ఈ మ్యాచ్‌ విజయంలో బెన్‌స్టోక్స్‌ నిజంగా అద్భుతమైన పాత్ర పోషించాడనే చెప్పుకోవాలి. 2వ టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 255 బాల్స్‌కు 100 రన్స్‌ చేసి నెమ్మిదిగా సెంచరీ నమోదు చేసుకున్నాడు. కానీ అదే బెన్‌స్టోక్స్‌ కష్టకాలంలో జట్టును గెలిపించాలనే ఉద్దేశంతో రెండో ఇన్నింగ్స్‌లో 36 బంతుల్లో 50 పరుగులు చేసి సత్తాచాటాడు. ఫలితంగా టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌గా బ్యాటింగ్‌ రికార్డు సాధించాడు.

మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌ 57 బంతుల్లో 78 స్కోర్‌ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులోనాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. విండీస్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టో‍క్స్‌ ఓపెనర్‌గా దిగడం గమనార్హం. మొత్తానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1 సమం చేసిన ఇంగ్లండ్‌ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం మాంచెస్టర్‌ ఓల్డ్‌ ట్రపోర్డ్‌ మైదానంలో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిస్తే సిరీస్‌ సమం అవుతుంది.