ఇండియన్ బౌలర్ ముఖానికి తీవ్ర గాయం…!

Bengal Pacer Ashok Dinda Suffers Injury After Ball Hit On Head During Practice Match

భారత ఫాస్ట్ బౌలర్ అశోక్ దిండా ముఖానికి సోమవారం తీవ్ర గాయమైనట్టు సమాచార అందుతోంది. కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈరోజు జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అశోక్ దిండా బౌలింగ్ చేస్తుండగా బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి నేరుగా వచ్చి అతడి ముఖానికి తాకింది. దీంతో ఆయనకు తీవ్ర మైన గాయం కాగా ఆయన నేల మీద కుప్పకూలి పోయాడు. దీంతో ఈ పేసర్‌ ని ప్రథమ చికిత్స అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం బెంగాల్ జట్టు ఈ రోజు ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది.

ఈ మ్యాచ్‌ లో 34 ఏళ్ల అశోక్ దిండా ఆఫ్ స్టంప్‌కి వెలుపగా ఫుల్‌టాస్ బంతిని విసరగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ వివేక్ సింగ్ దాన్ని స్ట్రైట్‌గా హిట్ చేశాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి దిండా ముఖానికి తాకింది. గాయానికి స్కానింగ్‌ తీసిన తర్వాత ఆయనకు ఏమైందనేది పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. 2009, డిసెంబరు 9న శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన అశోక్ దిండా నాలుగేళ్లలోనే జట్టుకి పూర్తిగా దూరమైపోయాడు. అతను ఆఖరిసారి 2013లో భారత్ తరఫున ఆడాడు. ఆ తర్వాత కేవలం ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌కే పరిమితమైన ఈ ఫాస్ట్ బౌలర్ తలకి రిబ్బన్ కట్టుకుని బౌలింగ్ చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.