బాబు దీక్షకు జాతీయ నేతల మద్దతు…మరో ఐక్యతా ప్రదర్శన…!

AP CM Chandra Babu Inmates At Delhi

విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా అంశాలలో కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సంఘీభావం తెలిపారు. దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చిందని, ప్రత్యేక హోదా హామీ కూడా పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిందేనని ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తామని తెలిపారు. అలాగే దీక్షకు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ మద్దతు ప్రకటించారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడంలో ప్రతిపక్షం ఐక్యంగా ఉంటుందని, ఈ విషయంలో తాము ముందుంటామని ఈ సందర్భంగా దీదీ స్పష్టం చేశారని తెలిపారు. కేంద్రం తీరును నిరసిస్తూ రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కోల్‌కతాలో మమతా బెనర్జీ దీక్ష చేపట్టగా చంద్రబాబు కోల్‌కతా వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించారు.

మరోపక ఈ దీక్షకు హాజరైన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కేంద్రంపై మండిపడ్డారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలను అమలుచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తెలిపారు. ధర్మం తప్పినప్పుడే ఆందోళన మొదలవుతుందనీ, అందుకే ఏపీ ప్రజలు ఇక్కడకు వచ్చారని అన్నారు. ఓట్ల కోసం కేంద్రం కులాలు, మతాలను విభజించి పాలించాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం పోతేనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి వ్యక్తిగత దూషణలకు దిగజారకూడదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తొలుత ఫరూక్ అబ్దుల్లా, ఆ తరువాత రాహుల్ గాంధీ దీక్షాస్థలికి రాగా, ఆపై మన్మోహన్ సింగ్, ములాయం సింగ్ యాదవ్, అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మ తదితరులు వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రత్యేక సందేశాన్ని పంపారు. మమత పంపిన సందేశాన్ని ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ చదివారు. కొన్ని అత్యవసర కారణాల వల్ల ఆమె రాలేకపోయారని చెప్పారు. కాగా, మధ్యాహ్నం తరువాత కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ తదితరులు ధర్మపోరాట దీక్షకు రానున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం సోనియాగాంధీ సైతం వేదిక వద్దకు వస్తారని తెలిపాయి.