రాష్ట్ర విభజన సమయాన ఏపీలో కలిపిన అయిదు గ్రామ పంచాయితీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలనే డిమాండ్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అఖిలపక్షం ఆధ్వర్యాన చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో బంద్‌కు పిలుపునివ్వగా వ్యాపారులు, వర్తకులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు నడవలేదు. ఉదయం నుంచే ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో బస్టాండ్ నిర్మానుష్యంగా కనిపించింది. ఏకపక్షంగా ఏపీలో కలిపిన ఐదు పంచాయితీలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్‌తో శుక్రవారం తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను దిగ్బంధం చేయనున్నట్టు అఖిలపక్షం నేతలు తెలిపారు.