ద‌ళిత‌సంఘాల బంద్ హింసాత్మ‌కం… న‌లుగురు మృతి

Bharat Bandh SC ST atrocities Act Protest four People Dead

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చ‌ట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్య‌తిరేకంగా ద‌ళిత సంఘాలు చేప‌ట్టిన బంద్ హింసాత్మ‌కంగా ముగిసింది. బంద్ కార‌ణంగా న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్త‌రాదిపై బంద్ ప్ర‌భావం తీవ్రంగా క‌నిపించింది. ముఖ్యంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్ బంద్ లో అవాంఛ‌నీయ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని గ్వాలియ‌ర్, భింద్, మోరెనా, సాగ‌ర్, బాలాఘాట్, స‌త్నా జిల్లాల్లో నిర‌స‌న‌లు హింసాత్మ‌క‌రూపు దాల్చ‌డంతో… ఆందోళ‌న‌కారుల‌ను అదుపుచేయ‌డానికి పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో న‌లుగురు మ‌ర‌ణించారు. ప‌లువురికి గాయాల‌య్యాయి. మృతుల్లో మోరెనా ప‌ట్ట‌ణానికి చెందిన విద్యార్థి నేత రాహుల్ ప‌తాక్ ఉన్నారు. ప‌రిస్థితి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో క‌ర్ఫ్యూ విధించి… ఆర్మీని రంగంలోకి దించారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోనూ ప‌లు హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి.

మీర‌ట్ జిల్లా శోభాపూర్ పోలీస్ ఔట్ పోస్టుకు ఆందోళ‌న కారులు నిప్పుపెట్టారు. ప‌దుల సంఖ్య‌లో బ‌స్సులు అగ్నికి ఆహుతి చేశారు. ఆగ్రాలో ఆందోళ‌నకారులు పోలీసులు, మీడియా సిబ్బందిపై రాళ్ల‌దాడికి దిగారు. దీంతో నిర‌స‌న‌కారులను చెద‌ర‌గొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై స్పందించిన ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ శాంతియుత మార్గంలో నిర‌స‌న చేప‌ట్టాల‌ని ఆందోళ‌న‌కారుల‌ను కోరారు. గుజ‌రాత్, రాజ‌స్థాన్ లోనూ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రిగాయి. రాజస్థాన్ లో ప‌లుచోట్ల క‌ర్ఫ్యూ విధించారు. పంజాబ్, బీహార్ లో రైళ్లు నిలిపివేశారు. జాతీయ‌ర‌హ‌దారుల దిగ్బంధ‌నం జ‌రిగింది. నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ఢిల్లీలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటుచేశారు.

ఆందోళ‌న‌ల కార‌ణంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. క‌న్నౌట్ ప్రాంతంలో నిర‌స‌న‌కారులు భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు చెందిన వారిని వేధించిన‌ట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొనేవారి తక్ష‌ణ అరెస్ట్ ను నిషేధిస్తూ ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఉత్త‌ర్వులిచ్చింది. ఈ తీర్పును వ్య‌తిరేకిస్తూ ద‌ళిత సంఘాలు భార‌త్ బంద్ నిర్వ‌హించాయి. అటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం రివ్యూ పిటిష‌న్ దాఖ‌లుచేసింది. కోర్టు ఉత్త‌ర్వుపై స్టే విధించి త‌క్ష‌ణ విచార‌ణ జ‌రిపించాల‌ని కేంద్రం కోర‌గా, స్టే ఇవ్వ‌డానికీ, త‌క్ష‌ణ విచార‌ణ చేప‌ట్ట‌డానికీ అత్యున్న‌త‌న్యాయ‌స్థానం నిరాక‌రించింది.