భరత్‌ వాఘ్మారే వివాదాస్పద వ్యాఖ్యలు

భరత్‌ వాఘ్మారే వివాదాస్పద వ్యాఖ్యలు

రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుక కోసిన వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని ఆల్‌ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భరత్‌ వాఘ్మారే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కి ధైర్యం ఉంటే తన పదవికి రాజీనామా చేసి రాజ్యాంగం మారుస్తాననే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లాలని డిమాండ్‌ చేశారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆ సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి ఎమ్‌.విజయ్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.నానులు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఈ ఏడేళ్లలో ఒక్కసారి కూడా జయంతి, వర్థంతుల సందర్భంగా ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేయలేదని, ఆయనకు అంబేద్కర్‌ అంటే గౌరవమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేసుకోవచ్చని రాజ్యాంగంలోనే ఉందని, ఇప్పటివరకు 130 సార్లు సవరించారని, అలాంటిది ఏకంగా రాజ్యాంగాన్నే మారుస్తామనడం కేసీఆర్‌ అహంకారానికి నిదర్శనమన్నారు. వెంటనే అంబేడ్కర్‌ విగ్రహంవద్ద కేసీఆర్‌ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో తలారి గోపాల్, షర్మిల జాదవ్, వినోద్‌కుమార్, సురేందర్, లింగన్న పాల్గొన్నారు.