భారతీయుడు-2కి లైన్‌క్లియర్

bharatiyudu 2 second schedule in august

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అగ్ర నటుడు కమల్‌హాసన్. ఇకపై ఆయన సినిమాల మీద అంతగా దృష్టిపెట్టకపోవచ్చని చెన్నై సినీ వర్గాల్లో వినిపించింది. అయితే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ప్రస్తుతం రెండు సినిమాల్ని పట్టాలెక్కించారు కమల్‌హాసన్. ఆయన కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారతీయుడు-2 చిత్రం ఆర్థిక కారణాల వల్ల మధ్యలో ఆగిపోయిందనే వార్తలొచ్చాయి. సినిమా తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయంలో ఎవరి దగ్గర స్పష్టత లేకుండా పోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆగస్ట్ 19 నుంచి ఈ సినిమా చిత్రీకరణను తిరిగి మొదలుపెట్టేందుకు చిత్ర బృందం నిర్ణయించిందని తెలిసింది. ఈ సినిమాలో కాజల్‌అగర్వాల్ ప్రధాన నాయికగా నటిస్తున్నది. ఆమెతో పాటు ప్రియాభవానిశంకర్, ఐశ్వర్యరాజేష్‌లను కథానాయికలుగా తీసుకోబోతున్నారు.

ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నిర్మాతలకు, దర్శకుడు శంకర్ మధ్య వచ్చిన ఆర్థికపరమైన విభేదాల వల్ల సినిమా నిర్మాణానికి మధ్యలోనే బ్రేక్‌పడింది. అయితే కమల్‌హాసన్ మధ్యవర్తిత్వం జరిపి సినిమా పునఃప్రారంభం అయ్యేలా కృషి చేశారని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. భారతీయుడు-2తో పాటు స్వీయ దర్శకత్వంలో కమల్‌హాసన్ తలైవన్ ఇరుకిండ్రాన్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. 2015లో మొదలుపెట్టిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని కూడా ఇటీవలే తిరిగి పట్టాలెక్కించారు కమల్‌హాసన్. దీనికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. ఇలా ఏకకాలంలో రెండు చిత్రాల్ని తిరిగి సెట్స్‌మీదకు తీసుకెళ్తూ వార్తల్లో నిలిచారు కమల్‌హాసన్.