మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బహిరంగ లేఖ

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బహిరంగ లేఖ

ఏపీ సీఎం జగన్‌కి టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు విని జగన్ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలంలో 871 అడుగుల నీట మట్టం ఉన్నా సాగు భూములకు నీటి కొరత ఏర్పడిందని అన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల వరకు నీరు విడుదల చేసేందుకు అవకాశం ఉన్నా ఇప్పటి వరకు కేసీఆర్‌ కెనాల్‌ ద్వారా కేవలం 2.30 లక్షల ఎకరాలకు మాత్రమే అందించడం వైసీపీ ప్రభుత్వ, సీమ ప్రజలకు చేస్తున్న అన్యాయం కాదా అని ప్రశ్నించారు.

అయితే జగన్ చేస్తున్న దౌర్జన్యాలకు భయపడి కియా అనుబంధ పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయాయని, కడప స్టీల్‌ ప్లాంట్‌కు టీడీపీ ప్రభుత్వం 2వేల కోట్లు కేటాయించిందని కానీ వైసీపీ సర్కార్ ఎందుకు 2 వేల కోట్లు కేటాయించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లు విమానాశ్రయం ఏర్పాటు చేస్తే కనీసం వైసీపీ సర్కార్ విమానాలు కూడా నడపలేకపోయిందని అన్నారు. సౌర, పవన, విద్యుత్‌ ప్లాంటులు నిర్మించి 13వేల మందికి తాము ఉద్యోగాలు కల్పిస్తే మీ ప్రభుత్వం పెట్టుబడులు రాకుండా అడ్డుకుందని అన్నారు. అయితే ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, తమ పరిధిలో లేని హైకోర్టు తరలింపును కర్నూల్‌కి ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూల్‌కి రాజధాని ఇవ్వాలని, లేదంటే అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.