భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారం అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు బాలీవుడ్ మెగాస్టా్ర్ అమితాబ్ బచ్చన్‌కు దక్కినందుకు ఎందరో అభిమానులు, సినీ ప్రముఖులు ఎంతో సంతోషించారు. అమితాబ్ కంటే ఎక్కువగా వారే సంబరపడిపోయారు. అయితే ఈ అవార్డుకు తాను అర్హుడిని కానని అంటున్నారు అమితాబ్. ఈ మేరకు తన బ్లాగ్‌లో అభిప్రాయాలను వెల్లడించారు.
‘నాకు దాదా సాహెబ్ ఫాల్కే ప్రకటించగానే ఎందరి నుంచో అభినందనలు వచ్చాయి. ఆ ఆనందంతో నాకు స్పర్శ కూడా తెలీడంలేదు. అయితే ఈ అవార్డుతో నాకు కాస్త అసౌకర్యంగా ఉందని చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఈ అవార్డుకు నేను అర్హుడిని కాననిపిస్తోంది. బహుశా కమిటీ సభ్యులు పొరపాటున నాకు అవార్డును ప్రకటించారేమో’ అని పేర్కొ్న్నారు. మంగళవారం కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అమితాబ్‌కు దాదా సాహెబ్ ప్రకటిస్తున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు. బిగ్ బికి ఓ అలవాటు ఉంది. తన గురించి ఎవరైనా పొగిడినా, లేదా ఇలాంటి అవార్డులతో సత్కరించినా ఇందులో తన గొప్పతనం ఏమీ లేదని, అంతా తనకు సోదరుడిలాంటివాడైన ధర్మేంద్ర వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అంటుంటారు.
ఎందుకంటే.. అమితాబ్, ధర్మేంద్ర నటించిన ‘షోలే’ సినిమాతోనే బిగ్‌బి స్టార్డం అమాంతం పెరిగిపోయింది. షోలేలో అమితాబ్‌కు అవకాశం ఇప్పించింది ధర్మేంద్రనే. అందుకే అమితాబ్ తనకు వచ్చిన క్రెడిటంతా ధర్మేంద్రకే దక్కుతుందని అంటుంటారు. అమితాబ్ ఇలా స్పందించడంపై ఓసారి ధర్మేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షోలే సినిమాలో అమితాబ్‌కు తాను అవకాశం ఇప్పించిన మాట నిజమే కానీ ఈ విషయం ఆయన అప్పట్లో ఎప్పుడూ చెప్పలేదని నొచ్చుకున్నారు. ఇప్పుడు ఇంతటి స్టార్డం ఆయనకు ఉంది కాబట్టి తన వల్లే ఈ స్థాయలో ఉన్నానని చెబితే నలుగురిలో మరింత మంచి పేరు తెచ్చుకున్నవాడు అవుతాడని ధర్మేంద్ర అన్నారు. ఏదేమైనా బిగ్‌బి లాంటి నటుడు బాలీవుడ్లో మళ్లీ పుట్టడనే చెప్పాలి.