ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులకు ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఊహించని షాకిచ్చాడు. 34 ఏళ్ల వయసులోనే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. సాంప్రదాయ క్రికెట్ నుంచి వైదొలగాలనుకున్న విషయం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్వుడ్లతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు.
మొయిన్ అలీ రిటైర్మెంట్ అంశాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సైతం దృవీకరించింది. కాగా, 2014లో శ్రీలంకతో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన మొయిన్ అలీ.. ఇంగ్లండ్ తరఫున 64 టెస్ట్‌ల్లో 2914 పరుగులు చేయడంతో పాటు 195 వికెట్లు పడగొట్టాడు. 2019 యాషెస్ సిరీస్ తర్వాత టెస్ట్‌ల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మొయిన్ అలీ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.