స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు భారీ షాక్

స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు భారీ షాక్

చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం కంపెనీ షావొమీ తన వినియోగదారులకు భారీ షాకిచ్చింది. సరసమైన ధరలు, అద్భుత ఫీచర్ల స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌ టీవీలతో వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుని, భారత మార్కెట్లో టాప్‌ పొజిషన్‌లోకి దూసు​కొచ్చిన షావోమి తన ఉత్పత్తులపై ధరలను 3-6 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. విడిభాగాల కొరత, దిగుమతి వ్యయాల కారణంగా జూలై 1 నుంచి కొత్త ధరలను సవరిస్తున్నట్టు వెల్లడించింది.

డిమాండ్‌-సరఫరా మధ్య అంతరాయం పెరగడంతో విడిభాగాల ధరలు పెరుగుతూ వస్తున్నాయని కంపెనీ పేర్కొంది.భారతదేశంలో జూలై 1 నుంచి తమ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీల ధరలను 3-6 శాతం పెంచిన ధరలు అమల్లో ఉంటాయని షావోమి ప్రకటించింది. షిప్పింగ్‌ చార్జీల భారం, కాంపోనేట్స్‌ కొరత కారణంగా ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇండియా ప్రతినిధి తెలిపారు. గత సంవత్సరం నుండి భారీ డిమాండ్-సరఫరా అసమతుల్యత నెలకొంది.

ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్‌లలో  ఉపయోగించే భాగాల ధరలు బాగా పెరిగాయని తెలిపారు.కాగా గ్లోబల్‌ మార్కెట్లో ప్యానెళ్ల ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగాయి. సముద్ర సరుకు రవాణా ఛార్జీలూ కూడా పెరిగాయి. ఈ నిర్వహణ వ్యయం పెరగడం వల్ల దేశీయంగా రవాణా ఖర్చులు ఏప్రిల్‌లో బాగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌ఈడీ టీవల విభాగంలో ఇతర సంస్థలు కూడా ఈ నెలలో ధరలను 3-4 శాతం పెంచనున్నాయని అంచనా.