ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం

మోడీ గడ్డ గుజరాత్‌లో ఇప్పటికే ప్రపంచంలోనే అతి పెద్దదైన సర్దార్ పటేల్ విగ్రహం ఏర్పాటై అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఇక్కడ నెలకొల్పారు. అహ్మదాబాద్‌లోని మొతెరాలో ఈ స్టేడియం నిర్మితమైంది. ఇక్కడ ఇంతకుముందే ఓ స్టేడియం ఉంది. దాన్ని సర్దార్ పటేల్ స్టేడియంగా పిలిచేవాళ్లు. దానికి దశాబ్దాల చరిత్ర ఉంది.

ఐతే 2015లో దాన్ని కూలగొట్టి కొత్త స్టేడియం నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఎల్ అండ్ టీ సంస్థ రూ.700 కోట్ల ఖర్చుతో మూడేళ్లకు పైగా శ్రమతో ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దింది. ప్రపంచంలో మరే క్రికెట్ స్టేడియానికీ ఇంత ఖర్చవ్వలేదు. దీని కెపాసిటీ కూడా ప్రపంచ స్టేడియాలన్నింట్లోకి అత్యధికం. ఏకంగా లక్షా పదివేల మంది స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూసే అవకాశముంది.

ఇప్పటిదాకా ఆస్ట్రేలియాలోని మెల‌్‌బోర్న్ క్రికెట్ స్టేడియమే ప్రపంచంలోకెల్లా అతి పెద్దది. దాని కెపాసిటీ 1,00,024. దాన్ని మొతెరా స్టేడియం అధిగమించనుంది. ఈ స్టేడియం, ఇతర నిర్మాణాలు కలిపి 63 ఎకరాల్లో విస్తరించడం విశేషం. స్టేడియంలో 3 వేల కార్లు, 10 వేల బైకులు పట్టేలా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 70 కార్పొరేట్ బాక్సులు, 4 డ్రెస్సింగ్ రూంలు, ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్.. ఇలా చాలా విశేషాలే ఉన్నాయి ఈ స్టేడియంలో.

పక్కనే మెట్రో స్టేడియం ఉండగా.. దాన్నుంచి నేరుగా స్టేడియం ఫస్ట్ ఫ్లోర్‌కు చేరుకునేలా కూడా ర్యాంప్ ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఏ మూలలో కూర్చున్నప్పటికీ వ్యూ బాగుండేలా దీన్ని డిజైన్ చేశారు. మెల్‌బోర్న్ స్టేడియాన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ సంస్థే దీనికీ డిజైన్ ఇచ్చింది. ఈ స్టేడియాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించనుండటం విశేషం. ఈ నెల 24, 25 తేదీల్లో ఢిల్లీ, అహ్మదాబాద్‌ల్లో పర్యటించనున్న ట్రంప్.. మొతెరాకు వెళ్లి స్టేడియాన్ని ప్రారంభించనున్నాడు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొంటారు.