బిగ్‌బాస్.. వినోదానికే కాదు, వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్. కేవలం గంటపాటు చూపించే ఎపిసోడ్‌లోనే ఆటపాటలు, అలకలు, కొట్లాటలు, కేరింతలు, సరదాలు, ఏడుపులు, పెడబొబ్బలు.. ఇలా ఎన్నింటినో చూపించారు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందనేది ప్రేక్షకులకు 24 గంటలు చూపిస్తే ఎలా ఉంటుంది? ఈ ఐడియాతో పురుడు పోసుకున్నదే బిగ్‌బాస్ ఓటీటీ.
తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో తాజాగా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరుతో సరికొత్తగా ముందుకు వచ్చింది. ఈసారి టీవీ ఛానల్‌లో కాకుండా కేవలం హాట్‌స్టార్‌లో మాత్రమే వీక్షించే అవకాశం కల్పించారు. అది కూడా కేవలం గంట ఎపిసోడ్‌లా కాకుండా 24 గంటలు ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. అప్పుడే హౌస్‌లో మొదటి నామినేషన్స్ కూడా జరిగిపోయాయి.ఈ నామినేషన్స్ తర్వాత కంటెస్టెంట్ల మధ్య మనస్పర్థలు పెరిగాయి.
ఈ క్రమంలో ముమైత్ ఖాన్ వల్ల హీరోయిన్ శ్రీరాపాక బాగా హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ఆమె తోటి కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. ‘మూడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ముమైత్ ఖాన్ నా చేయి విరగ్గొట్టింది, అప్పుడు నా చేయి వాచిపోయింది. దీనికి ఆర్జే చైతూనే సాక్ష్యం. ఆ సమయంలో చైతూ, కాజల్ అక్కడే ఉన్నారు. చేయి విరిగినట్లున్న రిపోర్టులు చూసి నా వైపు నిలబడ్డారు. అయినా సరే ఆ విషయాన్ని నేను అక్కడితో వదిలేశాను. కానీ ముమైత్ ఇంకా దాన్నే మనసులో పెట్టుకుంది. ఇప్పుడు బిగ్‌బాస్‌కు వచ్చాక నాతో అదోలా మాట్లాడుతోంది.
నేనే స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లినా కూడా సరిగా మాట్లాడటం లేదు. పైగా నన్ను లయర్ అనేసింది. నా శరీరానికి గాయం చేసినా పట్టించుకోలేదు. కానీ ఆమె మాత్రం అదే విషయాన్ని పట్టుకుని వేలాడుతూ నన్ను అంత మాట అనేసింది. చీటింగ్, లయర్ అనేవి నాకు నచ్చని పదాలు. ఆ మాట నేను భరించలేకపోతున్నాను’ అంటూ తన బాధను బయటకు చెప్పుకుంటూ ఏడ్చేసింది శ్రీరాపాక. దీంతో మిగతా కంటెస్టెంట్లు ఆమెను ఓదార్చారు. మరి నిజంగానే ముమైత్ గతంలో జరిగిన విషయాలను మనసులో పెట్టుకుందా? వీళ్లిద్దరి మధ్య దూరం పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది చూడాలి!