లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా బిగ్‌బాస్‌

లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా బిగ్‌బాస్‌

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా సినిమాలు, టీవీ షూటింగ్‌లు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో బుల్లితెర షో బిగ్‌బాస్‌ కూడా పలుచోట్ల వాయిదా పడింది. అయితే సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మలయాళం బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ ఇదివరకే ప్రారంభమైంది. దీంతో దీన్ని మధ్యలో ఆపేయకుండా షూటింగ్‌ కొనసాగిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి మరీ షో నిర్వహిస్తున్నారు.

అయితే ఈ షోలో పని చేసే 8 మంది సిబ్బంది కరోనా బారిన పడినప్పటికీ షో వాయిదా వేయకుండా షూటింగ్‌ జరుపుతున్నారు. ఈ వ్యవహారం కాస్తా పోలీసుల దృష్టికి రావడంతో వారు చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో బిగ్‌బాస్‌ సెట్‌కు వెళ్లి చిత్రీకరణను నిలిపివేశారు. హౌస్‌మేట్స్‌ను అక్కడ నుంచి హోటల్‌కు పంపించారు. బిగ్‌బాస్‌ సెట్‌ను మూసివేశారు. కాగా మలయాళ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైంది. ఫిబ్రవరి నుంచి ఈ షో ప్రసారమవుతుండగా హౌస్‌లో ఇప్పటికే 95 రోజులు ముగిశాయి. ఇక ఇటీవలే ఈ షోను మరో రెండువారాల పాటు పొడిగించినట్లు వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్‌ యధావిధిగా నిర్వహించడంతో తిరువళ్లూరు ఆర్డీవో ప్రీతి పర్కావి బుధవారం పోలీసులతో అక్కడికి వెళ్లి చిత్రీకరణను అడ్డుకున్నారు. కంటెస్టెంట్లతో సహా కెమెరామెన్లు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని పంపించి వేశారు. అనంతరం సెట్‌ను సీల్‌ చేసిట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం షూటింగ్‌లపై నిషేధం విధించినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరణ జరిపిన నిర్వాహకులపై కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే ఇంత జరిగినా బిగ్‌బాస్‌ కొనసాగుతుందని, జూన్‌ 4న గ్రాండ్‌ ఫినాలే జరగడం తథ్యం అని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం!