బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో నచ్చే రియాలిటీ షో బిగ్‌బాస్. అభిమాన తారలు ఒకచోట చేరి చేసే సందడి చూడాలని, వారు ఇంట్లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని ప్రేక్షకులు తెగ ఉవ్విళ్లూరుతుంటారు. నచ్చిన కంటెస్టెంట్లను మరికొన్నాళ్లు హౌస్‌లో ఉంచేందుకు ఓట్ల ప్రచారం చేస్తూ వారికి మద్దతుగా నిలబడుతుంటారు. అలా హౌస్‌లో పార్టిసిపేట్ల కంటే బయట వారి అభిమానులు చేసే సందడే ఎక్కువగా కనిపిస్తుంటుంది.
తెలుగులో విజయవంతంగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ త్వరలో ఐదో సీజన్లోకి అడుగు పెట్టనుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల కంటెస్టెంట్ల ఎంపిక, హౌస్ సెట్టింగ్ వేయడానికి చాలా సమయం తీసుకుంటోంది. దీంతో జూన్‌లోనే ప్రారంభం కావాల్సిన బిగ్‌బాస్ వాయిదా పడక తప్పలేదు. ఏదేమైనా జూలైలో బిగ్‌బాస్ స్టార్ట్ అవుతుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి.కానీ తాజాగా ఈ రియాలిటీ షో మరికొంత ఆలస్యంగా అంటే ఆగస్టు నెలాఖరులో మొదలవుతుందని ఫిల్మీదునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి ఆగస్టులో ఎలాగైనా బిగ్‌బాస్ షోను మొదలు పెట్టాల్సిందేనని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. కానీ ఒకవేళ అప్పటికీ అన్ని పనులు పూర్తవకపోతే గతేడాదిలాగే ఈసారి కూడా సెప్టెంబర్ మొదటివారం నుంచి బిగ్‌బాస్ ప్రసారమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సీజన్‌కు భళ్లాలదేవ రానా హోస్ట్‌గా వ్యవహరిస్తాడని ప్రచారం జరిగింది, కానీ మరోసారి కింగ్ నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.