ఆగిపోయిన ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ లైవ్‌

ఆగిపోయిన ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ లైవ్‌

బిగ్‌బాస్‌ రియాలిటీ షో క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలో అన్ని భాషల్లో బిగ్‌బాస్‌ ఎంతో ప్రేక్షక ఆదరణ పొందింది. తెలుగులో ఇప్పటికే 5సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ ఇప్పుడు ఓటీటీలోకి ఎంటర్‌ అయిపోయింది. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ పేరుతో ప్రేక్షకులకు 24 గంటల ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోంది. ఈ సరికొత్త బిగ్‌బాస్‌ ఇటీవల ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. 17 మంది కంటెస్టెంట్లతో 24 గంటల పాటు 84 రోజులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ షో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షో మొదలై దాదాపు వారం రోజులు గడిచింది.

అప్పుడే హౌజ్‌లో గొడవలు, టీంలు, నామినేషన్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫుల్‌ ఆసక్తిగా సాగుతున్న బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నిన్న ఆటంకం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ తరచూ ఆగిపోతోంది. అయితే దీనిపై తరచూ సబ్‌స్క్రైబర్ల నుంచి కంప్లైంట్స్‌ కూడా వస్తున్నాయట. ఇదిలా ఉంటే అందరినీ నిరాశపరుస్తూ నిన్న అర్ధరాత్రి నాన్ స్టాప్ లైవ్ స్ట్రీమింగ్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిలిపివేసింది. ఒక్కసారిగా షో ఆగిపోవడంతో ప్రేక్షకులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. షో ఎందుకు ఆగిపోయిందో హాట్ స్టార్ వెల్లడించలేదు. అయితే గురువారం అర్ధరాత్రి నుంచి మళ్లీ స్ట్రీమింగ్ ను ప్రారంభిస్తామని తెలిపింది.