కిడ్నీ అమ్మి క‌ట్నం ఇవ్వాల‌నుకుంది…

Bihar woman want to sell her Kidney for Dowry

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జీవితంలో ఎదుర‌యిన చేదు అనుభ‌వాలు ఆమెలో ఆలోచ‌నా శ‌క్తిని న‌శింప‌చేశాయి. వైవాహిక జీవితంలో ఓ సారి ఎదుర‌యిన వైఫ‌ల్యం మ‌రోసారి రాకూడ‌ద‌న్నఆశ‌ను తీర్చుకునే క్ర‌మంలో ఆమె వివేచ‌న లేకుండా ప్ర‌వ‌ర్తించ‌బోయింది. అయితే స‌కాలంలో విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో ఆమె త‌న ఆలోచ‌న‌ను మార్చుకుంది. బీహార్ కు చెందిన ఓ యువ‌తి క‌థ ఇది. వివరాల్లోకి వెళ్తే…

బీహార్ కు చెందిన 21 ఏళ్ల యువ‌తి కిడ్నీ అమ్మ‌బోతూ ఢిల్లీ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డింది. ఆమె కిడ్నీ అమ్మ‌డానికి కార‌ణం అనారోగ్య స‌మస్య‌లో, ఆర్థిక ఇబ్బందులో కాదు… క‌ట్నం డ‌బ్బుకోసం ఆమె కిడ్నీ అమ్మ‌బోయింది. వినడానికి ఆశ్చ‌ర్యంగానూ, విషాదంగానూ అనిపించినప్ప‌టికీ ఇది నిజం. యువ‌తి ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డానికి వెన‌క ఓ విషాదం దాగిఉంది. వ‌ర‌క‌ట్న దురాచారం వంటి విష‌యాల‌ను ప‌క్క‌న‌పెడితే… స‌మాజంలో న‌డుస్తున్న సంప్ర‌దాయం ప్ర‌కారం మామూలు అమ్మాయిల్లాగ‌యితే… యువ‌తి త‌ల్లిదండ్రులే ఆమెకు క‌ట్న‌మిచ్చి పెళ్లిచేయాలి. కానీ ఆ యువ‌తి ప‌రిస్థితి ఇందుకు భిన్నం, ఎందుకంటే… త‌ల్లిదండ్రులు… అమెకు అంద‌రు అమ్మాయిల్లానే కొన్ని నెల‌ల క్రితం వివాహం చేశారు. కానీ భ‌ర్త‌తో విభేదాలు రావ‌డంతో ఆమె అత్తవారింటినుంచి వ‌చ్చేసింది. ఆ త‌ర్వాత మ‌రో అబ్బాయితో ప్రేమ‌లో ప‌డింది. త‌న త‌ల్లిదండ్రుల్ని ఒప్పించి ఆ యువ‌కుడిని వివాహంచేసుకోవాల‌నుకుంది. కానీ త‌ల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో పారిపోయి పెళ్లిచేసుకోవడానికి సిద్ధ‌ప‌డింది.

స‌రిగ్గా ఆ స‌మ‌యానికే యువ‌కుడు త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. త‌న‌కు రూ. 1.8ల‌క్ష‌ల క‌ట్నం కావాల‌ని, ఆ డ‌బ్బు ఇస్తేనే… పెళ్లిచేసుకుంటాన‌ని తెగేసి చెప్పాడు. వారి బంధాన్ని వ్య‌తిరేకిస్తున్న త‌ల్లిదండ్రులు క‌ట్న‌మిచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టంచేశారు. అంత డ‌బ్బు ఇవ్వ‌డానికి ఆమె ద‌గ్గ‌ర చిల్లిగ‌వ్వ కూడా లేదు. ఇప్ప‌టికే ఓ వివాహ బంధం ముగిసిపోవ‌డం, మ‌రో బంధం పెళ్లిదాకా వ‌చ్చి ఆగిపోతుండ‌డంతో ఆ యువ‌తికి ఏం చేయాలో అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఆమెకు డ‌బ్బు సంపాద‌న‌కు ఒకటే దారి దొరికింది. త‌న కిడ్నీ అమ్ముకుని వ‌చ్చిన డ‌బ్బును ప్రియుడికి ఇచ్చి అత‌న్ని పెళ్లిచేసుకోవాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. ఇందుకోసం బీహార్ నుంచి ఢిల్లీ వెళ్లింది. ఒక ప్ర‌భుత్వాసుపత్రికి వెళ్లిన ఆ యువ‌తి కిడ్నీ దానం చేయాల‌నుకుంటున్నాన‌ని తెలిపింది. కానీ ఆమె ప్ర‌వ‌ర్త‌న అనుమానాస్ప‌దంగా ఉండ‌డంతో అక్క‌డి వైద్యుల‌కు ఆమె కిడ్నీ అమ్ముతున్న‌ట్టు అనుమాన‌మొచ్చింది. దాంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదుచేశారు. విచార‌ణ‌లో యువ‌తి అస‌లు నిజం పోలీసుల‌కు చెప్పింది. పోలీసులు యువ‌తిని స్టేష‌న్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రేమించి, క‌ట్నం అడిగిన యువ‌కుడిపై ఫిర్యాదు రాసివ్వ‌మ‌ని కోరారు. అయితే ఫిర్యాదుచేసేందుకు ఆ యువ‌తి నిరాక‌రించింది. కిడ్నీ అమ్మ‌కం ఆలోచ‌న విర‌మించుకుని తిరిగి బీహార్ వెళ్లిపోయింది.