బిల్‌గేట్స్‌ విజ్ఞప్తి

బిల్‌గేట్స్‌ విజ్ఞప్తి

కరోనాతో తీవ్ర అనారోగ్యం పాలుపడకుండా ఉండేందుకు తక్షణమే ప్రజలంతా కోవిడ్‌ టీకాలు తీసుకోవాలని ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ విజ్ఞప్తి చేశారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులతో కరోనా సంక్షోభం అత్యంత తీవ్రదశకు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోందని, టీకా తీసుకున్నవారిలో కూడా ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తోందని ఇప్పటికే డబ్లు్యహెచ్‌ఓ ప్రకటించింది.

ఇలాంటి పరిస్థితుల్లో హాలీడే సీజన్‌లోకి అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోందని గేట్స్‌ చెప్పారు. అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండకపోవచ్చని, భవిష్యత్‌లో ఒక రోజు ఈ మహమ్మారికి అంతం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటివరకు ఒకరికొకరు అండగా ఉండాలన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని భావిం చే సమయంలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒమిక్రాన్‌ అందరికీ సోకుతోందని, తన స్నేహితుడు దీని బారిన పడడంతో తాను హాలీడే ప్రణాళికలను రద్దు చేసుకున్నానని తెలిపారు. వీలైతే బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా మరింత రక్షణ పొందవచ్చని గేట్స్‌ అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్‌ మనపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో ఇంకా తెలియదని, ఈ విషయాల్లో స్పష్టత వచ్చేవరకు అంతా దీన్ని సీరియస్‌గానే తీసుకోవాలని సూచించారు. డెల్టాలో కనీసం సగం తీవ్రత దీనికున్నా దీని వేగంతో అత్యంత భీభత్సం సృష్టించగలదని హెచ్చరించారు.