ఆడవాళ్లలో అండాల తయారీని గర్భనిరోధక మాత్రలు ఎలా అడ్డుకుంటాయో.. అలాగే ఇవి మగవాళ్లపై పని చేస్తాయట. అంటే.. మగవాళ్లలోనూ వీర్యకణాల తయారీ ఆపుతాయన్నమాట. కేవలం శారీరక సుఖం కోసం కలయిక కోరుకునే జంటల కోసం ఈ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తేనున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ డుండీప్రకటించింది. ఈ మేరకు గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతుండగా.. ఈ ప్రయోగాల్లో డుండీ మొదటి అడుగు వేసింది.ఈ మాత్రలు మార్కెట్లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు.
కారణం.. ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఈ ప్రయోగాల వెనుక ఉండడం. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ మగవాళ్ల సంతాన నిరోధక మాత్రల తయారీ నడుస్తోంది. ఇందుకోసం ఫౌండేషన్ నుంచి 1.7 మిలియన్ డాలర్ల సాయం అందించింది కూడా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేలా ఈ ట్యాబ్లెట్లను రూపొందిస్తున్నట్లు డుండీ యూనివర్సిటీ రిప్రొడక్టివ్ మెడిసిన్ ప్రొఫెసర్ క్రిస్ బర్రాత్ ఓ ప్రకటనలో వెలువరించాడు.సురక్షిత శృంగారం, ఆలస్యంగా పిల్లలు కనడం లేదా పూర్తి అయిష్టత కారణాలతో చాలా ఏళ్ల క్రితమే కండోమ్‌లను మార్కెట్లోకి తెచ్చారు సైంటిస్టులు.
అయితే వీటి తర్వాత మెడికల్ సైన్స్‌లో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు.. అదీ ఇంత కాలానికి తెర మీదకు రావడం విశేషం. 2015-19 మధ్య కాలంలో 121 మిలియన్ల మంది మహిళలు ఇష్టం లేకున్నా గర్భం దాల్చారని పలు సర్వేల్లో వెల్లడైంది. ముఖ్యంగా పేద దేశాల్లో జనాభా పెరుగుదలకు ఈ సంతాన నిరోధక మాత్రలు అడ్డుకట్ట వేస్తాయని ప్రొఫెసర్ క్రిస్ చెప్తున్నాడు. అయితే సుఖ వ్యాధుల్ని అడ్డుకుంటాయా? అని ప్రశ్నిస్తే.. తమ పరిధిలో ఆ అంశం లేదంటున్నారు ఆయన.