ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పీడ నుంచి ఎప్పుడు ఉపశమనం లభిస్తుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వాక్సిన్ల వాడకం దృష్ట్యా మహమ్మారి తీవ్రమైన దశ 2022లో ముగుస్తుందని ఈ విషయాన్ని తన బ్లాగులో చెప్పారు. కరోనా కొత్త వేరియంట్లతో వ్యాప్తి చెందడం, ప్రజలకు పూర్తిగా టీకాలు వేయడం అంత త్వరగా జరిగే పని కాదు గనుక మహమ్మారి ముగింపు తాను ఆశించినంత దగ్గరగా లేదని బిలియనీర్ చెప్పాడు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ఆందోళన తప్పదని అందులో ఎటువంటి సందేహం లేదని ఆయన అన్నారు. కొత్త వేరియంట్‌లను ప్రభావాన్ని వేగంగా గుర్తించడం, వ్యాక్సిన్‌లు, యాంటీవైరల్ డ్రగ్స్‌లో అభివృద్ధితో కలిపి, 2022లో కోవిడ్ తీవ్రత నుంచి బయటపడే అవకాశాలు ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రతి సీజన్‌లో కోవిడ్, ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రమాదకరమైన వేరియంట్లను ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని, మహమ్మారి అంతమయ్యేవరకు పోరాటం ఆపకూడదని సూచించారు.