వంద రూపాయాలు డ్రా చేద్దామని వెళ్లిన వ్యక్తికి తన ఖాతాలో ఏకంగా వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిస్తే.. ఎలా ఉంటుంది.. ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. ఆ సంతోషంలో నిజంగానే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదే అనుభవం ఎదురయ్యింది ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళకు.
20 డాలర్లు డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్లింది. అయితే ఆమె అకౌంట్‌లో సరిపడా మొత్తం లేవని.. ఇప్పుడు 20 డాలర్లు డ్రా చేస్తే అది ఓవర్‌డ్రాఫ్ట్ కిందకు వస్తుందని మెసేజ్ వచ్చింది. పర్లేదు అనుకుని డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు.
సదరు మహిళ అసలు తన బ్యాంక్ అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉందో చెక్ చేయగా.. దిమ్మ తిరిగే బొమ్మ కనిపించింది. ఏకంగా తన ఖాతాలో బిలయన్ డాలర్లు(74,26,19,00,000 రూపాయలు) ఉన్నట్లు చూపింది. ఇది చూసి ఆ మహిళకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యింది. వెంటనే బ్యాంక్‌కు వెళ్లి విషయం చెప్పగా.. వారు కూడా చెక్ చేశారు.
ఆమె అకౌంట్‌లోకి ఇంత మొత్తం ఎలా వచ్చిందో వివరించారు. వాస్తవానికి సదరు మహిళ అకౌంట్‌లో నెగిటివ్ బిలియన్ డాలర్ల సొమ్ము ఉంది. మోసాలను నివారించడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తారు. అనుమానాస్పదంగా తోచిన వ్యక్తి అకౌంట్‌ను లాక్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది అని తెలిపారు. ఫలితంగా సదరు మహిళ 20 డాలర్లను కూడా డ్రా చేసుకోలేకపోయింది అని వివరించారు.