Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కుటుంబం, పిల్లలుపై బాలీవుడ్ హీరోయిన్లు వ్యక్తంచేసిన అభిప్రాయాలు చూస్తే… కాలంతో పాటు మహిళల ఆలోచనలు ఎలా మారుతున్నాయో అర్ధమవుతుంది. ఒకప్పుడు మహిళలు తప్పనిసరిగా పెళ్లిచేసుకుని, పిల్లల్ని కనాలని భావించేవారు. సమాజం కూడా ఆ దిశగా మహిళలపై ఒత్తిడిపెంచేది. ఆ ఒత్తిడికి దాదాపుగా అందరూ తలొగ్గేవారు. ఉద్యోగాలు చేస్తూ సొంత కాళ్లమీద నిలబడి… జీవితంలో స్థిరత్వం సాధించినా… సమాజపరంగా మహిళలకు ఆ విషయంలో గుర్తింపు ఉండేది కాదు… పెళ్లయి పిల్లలుంటేనే మహిళ జీవితంలో స్థిరపడిన భావన ఉండేది. అప్పట్లో హీరోయిన్లూ ఇందుకు మినహాయింపు కాదు. ఏ భాషా హీరోయిన్నయినా… సినిమాల్లో ప్రవేశించి కొంచెం విజయవంతం కాగానే… అందరూ అడిగే ప్రశ్న పెళ్లెప్పుడనే… హీరోయిన్లు కూడా అలానే కొన్ని సినిమాలు చేసి, ప్రేమ వివాహమో, పెద్దలు కుదిర్చిన పెళ్లో చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పి… పిల్లలను చూసుకోడానికి పరిమితమయ్యేవారు. అయితే కాలానుగుణంగా వస్తున్న మార్పు మహిళల ఆలోచనల్లోనూ, వాళ్లను సమాజం చూసే దృక్పథంలోనూ కనిపిస్తోంది. కెరీర్ లో సెటిలయ్యాకే పెళ్లిచేసుకునే అమ్మాయిల సంఖ్య, కెరీర్ కోసం పెళ్లిని, పిల్లలను పక్కనపెట్టే మహిళల సంఖ్యా అంతకంతకూ పెరుగుతోంది. హీరోయిన్ల ఆలోచనల్లో కూడా అలాంటి మార్పే కనిపిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లు బిపాసాబసు, సుస్మితాసేన్ వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ.
బిపాసా 2016లో కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహం చేసుకుంది. అప్పటినుంచి మీడియా బిపాసా ఎక్కడ కనపడినా అడిగే ప్రశ్న… పిల్లల్నెప్పుడు కంటారని, గత ఏడాది బిపాసా భర్తతో కలిసి ఓ ఆస్పత్రికి వెళ్లడంతో బిపాసా ప్రెగ్నెంట్ అంటూ ఇంగ్లీష్ మీడియా వార్తలు రాసింది. తర్వాత బిపాసా ఆ వార్తలను ఖండించింది. ఆ తర్వాతోరోజు భర్తతో కలిసి కారులో వెళ్తూ బిపాసా ఎర్ర హ్యాండ్ బ్యాగ్ ఒడిలో ఉంచుకుంది. బ్యాగ్ రంగు, ఆమె వేసుకున్న డ్రెస్ కలర్ ఒకటే కావడంతో ఫొటోగ్రాఫర్లు ఒడిలో ఉన్న బ్యాగ్ చూసి పొరపడ్డారు. బిపాసా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రాశారు. దీనిపై బిపాసా దంపతులు ఘాటుగా స్పందించారు. బిపాసా గర్భిణి అయితే ముందు నాకే తెలుస్తుంది… మీకు కాదు, కరణ్ గ్రోవర్ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు మరోసారి మీడియా పిల్లల గురించి బిపాసా ను ప్రశ్నించగా ఆమె… ఈ తరం మహిళల ఆలోచనలకు అద్దం పట్టే సమాధానం ఇచ్చింది. ఓ మహిళలకు ఇలాంటి ప్రశ్నలు చాలా చిరాకు కలిగిస్తాయని, పిల్లల్ని కనడం ఓ అద్భుతమైన అనుభూతని, కానీ ఓ మహిళకు ఇంతకుమించిన విషయాలూ ఉంటాయని, పెళ్లయినంత మాత్రాన పిల్లల్ని కనాలన్న నిబంధన ఏమీ లేదని సమాధానమిచ్చింది బిపాస.
ఇక మరో నటి సుస్మితాసేన్ పెళ్లిపై ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. బిపాసా ఎక్కడ కనపడినా పిల్లల గురించి అడుగుతున్నట్టుగా… సుస్మిత ఎక్కడ కనపడ్డా… పెళ్లి గురించి అడుగుతుంటుంది మీడియా. ఈ మధ్య కాలంలో ఈ ప్రశ్న మరీ ఎక్కువకావడంతో సుస్మిత తనదైన రీతిలో రియాక్టయింది. చాన్నాళ్ల క్రితమే సుస్మిత ఇద్దరు ఆడపిల్లల్ని దత్తత తీసుకుని ఓ తల్లిలా వారిని పెంచిపెద్దచేస్తోంది. పెళ్లెప్పుడు అడిగిన ప్రశ్నకు ఆమె ఈ పిల్లల్నే సమాధానంగా చూపిస్తోంది. ఓ కుటుంబం కావాలంటే రక్తసంబంధమే అవసరం లేదని, ఫలానా వ్యక్తిని పెళ్లిచేసుకుని వారి ఇంటిపేరును జత చేసుకుంటేనే కుటుంబం అవ్వదని సుస్మిత అభిప్రాయపడింది. పిల్లల్ని దత్తత తీసుకోవడంలో ఎంతో ఆనందం ఉందని, దేశవ్యాప్తంగా 45 శాతం మంది అనాథలు అనాథాశ్రమాల్లో ఉండడం లేదని, ఎందుకంటే చాలా మంది పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారని, ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో ఆస్వాదిస్తేనే తెలుస్తుందని, తన పెళ్లిని దత్తత తీసుకున్న పిల్లలతో ముడిపెడుతూ సమాధానమిచ్చింది సుస్మిత. మొత్తానికి పెళ్లి చేసుకున్నంత మాత్రాన పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని బిపాసా, పిల్లల కోసం పెళ్లే కావాల్సిన అవసరం లేదని సుస్మిత చేసిన వ్యాఖ్యలు… మహిళల మారుతున్న ఆలోచనా విధానాలను ప్రతిబింబిస్తున్నాయి…