బిపిన్ రావత్ రిటైరయ్యాక ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామమైన ‘సైనా’లో ఇళ్లు కట్టుకోవాలని అనుకున్నారు. 2018 చివరిసారిగా ఆయన సొంతూరును సందర్శించారని బిపిన్ మేనమామ భరత్ తెలిపారు. పౌరి జిల్లాలోని ద్వారిఖాల్ బ్లాక్‌లో సైనీ గ్రామం ఉంది. ఈ ఊర్లో ప్రస్తుతం నివసిస్తున్న జనరల్ ఏకైక బంధువు భరత్.
‘2018లో వచ్చినపుడు కులదేవతకు పూజ చేశారు. రిటైరయ్యాక ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటానని చెప్పారు. స్వగ్రామంతో బిపిన్‌కు అనుబంధం ఎక్కువ. ఊరి జనం ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం తనను బాధిస్తోందని, రిటైరయ్యాక ఈ ప్రాంతం కోసం ఏదైనా చేస్తానని గ్రామస్తులకు చెప్పారు. బిపిన్ ఫోన్లో నాతో మాట్లాడేవారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సైనీకి వస్తానన్నారు’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పారు భరత్.
తన మేనల్లుడి కోరిక తీరకుండానే ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు. రావత్ సతీమణి మధులిక సొంతూరు మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లాలోని సొహాగ్‌పూర్. ప్రస్తుతం ఆమె కుటుంబం షాడోల్లో ఉన్న పూర్వీకుల ఇంట్లో నివశిస్తున్నారు. వచ్చే ఏడాది సొహాగ్‌పూర్ వచ్చి సైనిక పాఠశాల పనులు ప్రారంభిస్తానని రావత్ చెప్పినట్లు బావమరిది యశవర్ధన్ అన్నారు.