ఇంట‌ర్నెట్ అప్ప‌టినుంచీ ఉంది… త్రిపుర సీఎం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Biplab Deb Kumar controversy comments on Internet

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హిందూ సంస్థ‌లు కానీ, కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కానీ న‌మ్మేది… ప్ర‌చారం చేసేది… ప్ర‌పంచ‌మంతా ఇప్పుడు ఉప‌యోగించుకుంటున్న సాంకేతిక ప‌రిజ్ఞానం భార‌త దేశంలో పురాణాల కాలం నుంచే ఉంద‌ని, రామాయ‌ణ‌, మ‌హాభారతాల్లో సాంకేతికత వినియోగం జ‌రిగింద‌ని. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, కేంద్ర‌మంత్రులు… ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌లోకి ఈ విష‌యాన్ని చొప్పించేందుకు విశ్వ ప్ర‌య‌త్నం చేస్తుంటారు. విమానాన్ని క‌నుక్కుంది రైట్ బ్ర‌ద‌ర్స్ కాద‌ని వారి కంటే ముందుగానే శివ‌క‌ర్ బాపూజీ త‌ల్పాడే అనే భార‌తీయుడు విమానాన్ని త‌యారుచేశార‌ని అయితే అప్పుడు భార‌త్ బ్రిటిష్ పాల‌న‌లో ఉండ‌డంతో ఆ విష‌యం బ‌య‌ట‌కు రాలేద‌ని కేంద్ర‌మంత్రి స‌త్య‌పాల్ సింగ్ కొన్నినెల‌ల క్రితం వ్యాఖ్యానించారు.

అలాగే ఆధునిక విమానాల‌కంటే ముందే అస‌లు మ‌న‌దేశంలో పుష్ప‌క‌విమానం ఉంద‌ని, రామాయణంలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చే పుష్ప‌క‌విమానం గురించి ఐఐటీ పాఠ్యాంశాల్లో చేర్చాల‌ని కూడా ఆ మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీ సైతం ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. ఇస్రో అభివృద్ధి చేస్తున్న రాకెట్లు రామ‌బాణాల‌ని వ్యాఖ్యానించి వివాదం సృష్టించారు. ఇవే కాదు… బీజేపీ నేత‌లు ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు ఎన్నో చేశారు… చేస్తూనే ఉన్నారు. తాజాగా త్రిపుర కొత్త ముఖ్య‌మంత్రి బిప్ల‌బ్ కుమార్… కూడా టెక్నాల‌జీలో భార‌తీయ మూలాల‌పై వ్యాఖ్య‌లు చేశారు.

త్రిపుర రాజ‌ధాని అగ‌ర్త‌లాలోని ప్రజ్ఞాభ‌వ‌న్ లో కంప్యూట‌రైజేష‌న్ పై వ‌ర్క్ షాప్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి బిప్ల‌బ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంట‌ర్నెట్ అనేది కొత్త‌గా సృష్టించిన టెక్నాల‌జీ కాద‌ని, మ‌హాభార‌త స‌మ‌యం నుంచే ఇంట‌ర్నెట్ ఉంద‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు. కురుక్షేత్రంలో జ‌రిగిన 18 రోజుల యుద్ధం గురించి సంజ‌య్ అనే వ్య‌క్తి ధృత‌రాష్ట్రుడికి ఇంట‌ర్నెట్ ద్వారానే స‌మాచారం అందించార‌ని చెప్పారు. దీన్నిబ‌ట్టి చూస్తే మ‌హాభార‌తం స‌మ‌యం నుంచే దేశంలో ఇంట‌ర్నెట్ సేవ‌లు, శాటిలైట్లు అందుబాటులో ఉండేవ‌ని, అలా వేలాది సంవ‌త్స‌రాల క్రితం అందుబాటులో ఉన్న ఇంట‌ర్నెట్ ను జాతీయ స‌మాచార కేంద్రం వినియోగించుకుంటోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎన్ ఐసీ నిర్వాహ‌కుల ప‌నిత‌నాన్ని అభినందిస్తున్నాన‌ని, కానీ టెక్నాల‌జీని మీరు క‌నిపెట్ట‌లేద‌ని, వేలాది ఏళ్ల క్రిత‌మే క‌నిపెట్టార‌ని చెప్పుకొచ్చారు.

టెక్నాల‌జీని క‌నిపెట్టామ‌ని యూర‌ప్ దేశాలు చెప్పుకుంటాయ‌ని, నిజానికి ఆ టెక్నాల‌జీ భార‌త్ దని, బిప్ల‌బ్ కుమార్ విశ్లేషించారు. భార‌త మైక్రోసాఫ్ట్ ఇంజినీర్లు అమెరికాతో పాటు ఇత‌ర‌దేశాల్లోనూ ప‌నిచేస్తున్నార‌ని, సంస్కృతికి మ‌న‌దేశం పెట్టింది పేర‌ని తెలిపారు. న‌రేంద్ర మోడీ ప్ర‌ధాని అయ్యాకే యావ‌త్భార‌తం టెక్నాల‌జీకి మ‌రింత ద‌గ్గ‌ర‌యింద‌ని, అలాంటి ప్ర‌ధాని మ‌న‌కు దొర‌క‌డం అదృష్ట‌మ‌ని చెప్పారు. టెక్నాలజీని కేవ‌లం ధ‌నికులే కాకుండా పేద‌లు కూడా వినియోగించుకోవాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. మొత్తానికి విమానం, రాకెట్లు, ఇంట‌ర్నెట్ వంటి ఆధునిక సౌక‌ర్యాల‌న్నింటినీ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది భారత్ అని… ప్ర‌చారం చేసేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ బీజేపీనేత‌లు వ‌దులుకోవ‌డం లేదు.