Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనుగ్రహం ఆగ్రహంగా మారితే ఎలా ఉంటుందో కేంద్రంలోని nda సర్కార్ కి సారధ్యం వహిస్తున్న బీజేపీ కి ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. 2014 ఎన్నికల్లో మోడీ గెలుపుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచిన సోషల్ మీడియా నే ఇప్పుడు ఆ పార్టీ కి గుదిబండగా మారబోతోంది. సినీ నటి, మాజీ ఎంపీ రమ్య కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. మోడీసర్కార్ వైఫల్యాలు ప్రజలకు తేలిగ్గా తెలిసిపోతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత సైతం ఈ వ్యవహారంలో మహా చురుగ్గా పాల్గొంటోంది. మొదట్లో ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్న బీజేపీ కి కొద్ది సమయంలోనే జరుగుతున్న డామేజ్ అర్ధమైంది. దాని ఫలితమే ఇప్పుడు బీజేపీ అధికారిక ఫేస్ బుక్ పేజీలో రేటింగ్ ఇచ్చే సౌకర్యం లేకుండా చేశారు.
విభజన హామీలను బీజేపీ తుంగలో తొక్కినప్పటినుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ అంటే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక తాజాగా కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయం చూసాక వారి కోపం నషాళానికి అంటింది. దీంతో యువత చూపు తాము విస్తృతంగా వాడే ఫేస్ బుక్ లోని బీజేపీ పేజీ మీద పడింది. దీంతో అక్కడ రేటింగ్స్ విభాగంలోకి వెళ్లి లోయెస్ట్ రేటింగ్ ఇస్తూ తమ నిరసన తెలపడం మొదలెట్టారు. దీంతో 5 స్టార్ రేటింగ్ కన్నా సింగల్ స్టార్ రేటింగ్ లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ఆంధ్రుల కోపం ఏ రేంజ్ లో వుందో దీంతో బీజేపీ సోషల్ మీడియా విభాగం నిర్వహించేవాళ్లకు అర్ధం అయ్యింది. దీంతో ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో అర్ధం కానివాళ్ళు ప్రస్తుతానికి రేటింగ్ ఇచ్చే సౌకర్యాన్ని మూతవేసి ఆ గండం నుంచి బయటపడ్డారు.