ఉత్తరప్రదేశ్‌లోని సంత్‌కబీర్ నగర్ బీజేపీ మాజీ ఎంపీ శరద్ త్రిపాఠి (49) మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం గురుగ్రామ్‌లోని మెదంత ఆస్పత్రిలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన 2014లో సంత్‌కబీర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శరద్ త్రిపాఠి మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
‘ మాజీ ఎంపీ శరద్ త్రిపాఠి అకాల మరణం బాధాకరం. బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. సంత్ కబీర్ దాస్ సిద్ధాంతాలను ఆయన ప్రత్యేకమైన రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లారు. శరద్ త్రిపాఠి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అని మోదీ ట్వీటర్ వేదికగా సంతాపం తెలియాజేశారు. అదే విధంగా హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. శరద్ త్రిపాఠి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.