బిల్ పాస్ చేసుకున్న బీజేపీ !

నిరసనల మధ్యే కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లు-2018కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడానికి ఆస్కారం ఏర్పడింది. ఈ దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ బిల్లును హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ వాకౌట్ చేసింది.  ముస్లింలు కాకుండా ఆరు ఇతర మతాల వాళ్లకు భారత పౌరసత్వం ఇవ్వాలన్నది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అయితే.. దేశంలో ఎవరు ఆశ్రయం కోరినా ఇవ్వాలని, ఇందులో ముస్లింలను కూడా చేర్చాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) డిమాండ్ చేసింది. ఈ బిల్లు విభజనకు, హింసకు కారణమవుతుందని ఆ పార్టీ ఎంపీలు వాదించారు.  ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో అస్సాంతో బీజేపీ ప్రభుత్వానికి మిత్ర పక్షం అస్సాం గణపరిషత్ (ఏజీపీ) తమ మద్దతు ఉపసంహరించుకుంది. అసోంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక బీజేపీ మిత్రపక్షాలు కూడా ఈ బిల్లును తప్పు బడుతున్నాయి. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలకు విరుద్ధమైన బిల్లు అని వాదిస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షాలైన శివసేన, జేడీయూలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. మేఘాలయ, మిజోరం ప్రభుత్వాలతో పాటు ఈశాన్య ప్రాంతంలో పలు వర్గాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.