రాజకీయ ఎత్తుగడే…పని మొదలెట్టిన కేసీఆర్…!

KCR Suggested TRS MPs Ask For Amendments

కళ్ళతోటి నవ్వి నొసటితో వెక్కిరించడం అనే సామెత వినే ఉంటారు కదా, ఇది మన రాజకీయ నాయకులు తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదేమో. తాజాగా అగ్రవర్ణాల లో ఉన్న పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. మెజారిటీ పార్టీలు దీనిని స్వాగతిస్తూనే ఇది ఒక రాజకీయ ఎత్తుగడ అంటూ విమర్శిస్తున్నాయి. తాజాగా దీని మీద ఉత్తరప్రదేశ్ కి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఆమె కూడా ఇది చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయం అనిపించడం లేదని కేవలం రాజకీయ కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ రిజేర్వేషణ్ నిర్ణయం మంచిదే కానీ ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం మాత్రం మంచిది కాదని ఆమె వ్యాఖ్యానించారు. సరిగ్గా లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది రాజకీయ ఎత్తుగడలాగానే కనిపిస్తోందని.

ఒకవేళ నిజంగా లబ్ధి చేకూర్చాలని ఆలోచన ఉంటే ఇంతకు ముందే ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని ఆమె వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిన తప్పనిసరి అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. పనిలో పనిగా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదముద్ర వేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ ఎంపీలకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లులో సవరణలకు పట్టుబట్టాలని టీఆర్‌ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఈబీసీ బిల్లులో పలు సవరణలు చేయాలని తమ పార్టీ తరఫున కోరతామని ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. బిల్లులో సవరణలు చేసి తెలంగాణ డిమాండ్లు నెరవేర్చాలని కోరనున్నట్లు వెల్లడించారు. సభ చివరి రోజు ఇలాంటి బిల్లును తీసుకొచ్చి బీజేపీ గందరగోళం సృష్టించిందన్నారు. తెలంగాణలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సి ఉంది. తాజాగా కేంద్రం రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేపట్టినందున ఈ బిల్లులో తెలంగాణలో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కూడా చేర్చాలని కోరాల్సిందిగా సీఎం సూచించారు.