కరోనా మహమ్మారి వ్యాధితో చికిత్స పొందుతున్న బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (50) కన్నుమూశారు. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస తీసుకున్నారు. రేపు (అక్టోబర్ 13 న) ఆయన మృతదేహాన్ని పాట్నాకు తరలించనున్నారు.
మంత్రి వినోద్ సింగ్ జూన్ 28న కోవిడ్ బారినపడ్డారు. మంత్రితోపాటు ఆయన భార్యకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో కతియార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందజేశారు. అయితే కరోనా నుంచి ఇద్దరూ కోలుకున్నప్పటికీ, మంత్రికి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్స కోసం పట్నానుంచి ఆగస్టు 16న ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్‌కు తరలించారు. గత రెండు నెలలుగా మెరుగైన చికిత్స అందించినప్పటికీ మెదడులో రక్తం గడ్డకట్టడంతో మృత్యువు ఆయనను కబళించింది.
వెనుబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా వినోద్ సింగ్ర మణంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. సమర్థుడైన ప్రజాదరణ పొందిన నాయకుడంటూ సంతాపం తెలిపారు. ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు నష్టమని బీజేపీ పేర్కొంది. కతిహార్ జిల్లా ప్రాణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వినోద్ సింగ్ మూడుసార్లు గెలుపొందారు. కాగా వినోద్ భార్య నిషా సింగ్ ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రన్‌పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.