Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా…ఏపీ వ్యాప్తంగా బీజేపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. పలుచోట్ల బీజేపీ నేతలు బాలకృష్ణ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ లో బీజేపీ ఆందోళన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేతలు బాలకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధంచేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు కూడా అదే సెంటర్ లో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను తగులబెట్టారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కల్పించుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విజయవాడ,గుంటూరు, తిరుపతి,కాకినాడ సహా అనేక ప్రాంతాల్లో బీజేపీ నేతలు బాలకృష్ణ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. బాలకృష్ణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానిపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు వింటూ నవ్వుతున్నారని బీజేపీ నేత మాణిక్యాలరావు ఆరోపించారు.
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. బాలకృష్ణపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు ధర్మ పోరాట దీక్షపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అట్టహాసంగా చేసినదీక్షకు రూ. 200 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగ పరిచారని మండిపడ్డారు. రూ. 10 కోట్లు ఖర్చుపెట్టి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. మీడియాను ఉపయోగించి దుష్ప్రచారం చేయడం దారుణమని, నాడు ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడిని చేసినప్పుడు అబద్ధాలు ఎలా చెప్పారో, ఇప్పుడూ అలాగే జరుగుతోందని, టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని మాణిక్యాలరావు మండిపడ్డారు.