బీజేపీ కి గుండెపోటు.

BJP lose Uttar Pradesh Lok Sabha Bypoll elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అవును… నిజమే నిజంగా బీజేపీ కి గుండెపోటు వచ్చింది. దేశరాజకీయాలకు ఉత్తరప్రదేశ్ గుండెకాయ లాంటిది. సంఖ్యాపరంగా చూసినా , రాజకీయ అత్యున్నత పదవుల విషయంలో చూసినా ఈ మాట అక్షరాలా చెల్లుబాటు అవుతుంది. అంతెందుకు సంకీర్ణాలు తప్ప ఏక పార్టీ పాలన మర్చిపోయిన దేశానికి మళ్లీ బీజేపీ ని ఏకపక్షంగా ఢిల్లీ గద్దె లెక్కించడంలో కూడా యూపీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. బీజేపీ కి యూపీ ఓటరు 70 కి పైగా లోక్ సభ స్థానాల్లో విజయం అందించబట్టే ప్రధాని పీఠం మీద మోడీ చిద్విలాసం. ఆ పై వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అక్కడ భారీ విజయం సాధించింది. ఆ విధంగా దేశరాజకీయాలకే కాదు. బీజేపీ రాజకీయ ప్రస్థానానికి కూడా యూపీ గుండెకాయలా మారింది.

ఆ గుండెకే ఇప్పుడు ఉపఎన్నికల రూపంలో పోటు వచ్చింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఐదు సార్లు గోరఖ్ పూర్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నిక అయ్యారు. ఆ నియోజకవర్గాన్ని బీజేపీ కంచుకోటగా మార్చేశారు. అందుకు నజరానాగా మోడీ, అమిత్ షా ద్వయం ఆయన్ని యూపీ సీఎం పీఠం మీద కూర్చోబెట్టారు. దీంతో పాటు పూల్ పూర్ నియోజకవర్గంలో ఎంపీ గా గెలిచిన కేశవ్ మౌర్యాని ఉప ముఖ్యమంత్రి గా చేశారు. ఆ రెండు లోక్ సభ స్థానాల్లో ఈ నెల 4 న ఉప ఎన్నికలు జరిగాయి. సీఎం, డిప్యూటీ సీఎం సొంత స్థానాల్లో ఎన్నికలు కాబట్టి అక్కడ బీజేపీ విజయం మీద ఎవరికీ సందేహాలు లేవు. కాకుంటే కొద్దోగొప్పో మెజారిటీ తగ్గుతుందని అంతా భావించారు. కానీ ఈ రోజు ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గర నుంచి ఆ అంచనాలు తల్లకిందులు అయ్యాయి. గోరఖ్ పూర్, పూల్ పూర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు వెనుకబడ్డారు. బీజేపీ ని దెబ్బ కొట్టేందుకు సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు లోపాయికారీగా పరస్పర సహకారంతో ముందుకు నడిచాయి. ఈ పరిణామాన్ని ఏ మాత్రం వూహించకుండా గర్వంతో విర్రవీగిన బీజేపీ ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో ఓటమికి దగ్గర అయ్యింది. అయితే ఇది ఆ రెండు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కాదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన గుండెపోటుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.