Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“కుప్పంలో చంద్రబాబుని ఓడిస్తాం “… 2004 – 2009 మధ్యలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పదేపదే ఇటు అసెంబ్లీలో అటు బహిరంగ సభల్లోనూ చెప్పేవారు. ఆ పని జరగకపోయినా వై.ఎస్ కి అంత నమ్మకం కల్పించిన వ్యక్తి మాత్రం కుప్పం నేత సుబ్రహ్మణ్యం రెడ్డి. అందుకే ఆయన్ని వై.ఎస్ బాగా ప్రోత్సహించారు. జడ్పీ చైర్మన్ ని కూడా చేసి ఆదరించారు. ఆ కృతజ్ఞతతోటే సుబ్రహ్మణ్యం రెడ్డి కూడా వై.ఎస్ మీద అపారమైన అభిమానం పెంచుకున్నారు. వై.ఎస్ మరణం తర్వాత ముందుగా జగన్ వెంట నడిచి వైసీపీ లో చేరిపోయారు. వైసీపీ లో తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానాలకు గురి చేస్తున్నారంటూ వైసీపీ కి రాజీనామా చేశారు.
వైసీపీ కి రాజీనామా చేసే సందర్భంలో సుబ్రహ్మణ్యం రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యారు. వై.ఎస్ మీద ప్రేమ తప్ప ఇంకో వ్యాపకం, వ్యాపారం లేకుండా 30 ఏళ్ళు గడిపిన తాను జగన్ కి పనికి రాకుండా పోయానని ఆయన వాపోయారు. 2014 లో తనకు కుప్పం వైసీపీ టికెట్ ఇవ్వకపోయినా పని చేసినట్టు చెప్పుకున్నారు. తన కృషి వల్ల వైసీపీ కి 57 వేల ఓట్లు వచ్చాయని సుబ్రహ్మణ్యం రెడ్డి చెప్పుకున్నారు. అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో తనకు ఏ మాత్రం ప్రాధాన్యం లేకుండా చేయడం జీర్ణించుకోలేకపోతున్నట్టు సుబ్రహ్మణ్యం రెడ్డి కంటతడి పెట్టుకున్నారు.
వైసీపీ కి రాజీనామా చేసిన సుబ్రహ్మణ్యం రెడ్డి ని బీజేపీ దువ్వుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు మీద కుప్పంలో పోటీ చేసిన అనుభవం వున్న సుబ్రహ్మణ్యం రెడ్డి ని చేరదీయడానికి ఇప్పటికే కమలనాధులు పావులు కదిపినట్టు తెలుస్తోంది. బాబు సొంత జిల్లా చిత్తూరు లో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సీకే బాబుని చేరదీసి బీజేపీ ఇప్పుడు సుబ్రహ్మణ్యం మీద కూడా వల విసిరింది. ఈ పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ,టీడీపీ మధ్య తెగతెంపులు ఖాయం అనే ప్రచారానికి ఇంకాస్త ఊతం ఇచ్చేట్టు వున్నాయి.