సౌత్ లో బిజెపి దారి ఎటు?

BJP Travels in South India
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఉత్తర‌ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్కండ్, ఛత్తీస్‌ఘడ్ ఇలా కాశ్మీర్ నుండి తీర రాష్టం గోవా వరకు ఉత్తర భారతదేశం అంతా బిజేపి పవనాలు బలంగా వీస్తున్నాయి. మరి ఈ పవనాలను మధ్యలోని వింధ్య పర్వతాలను దాటి దక్షిణ భారతదేశం వైపు పంపాలని దక్షిణపథాన తమ జెండా రేపరేపలాడించాలని బీజేపీ చాలాసార్లు బలంగానే ప్రయత్నించింది ఆ మేరకు 2014 లో కాస్తో కూస్తో రాణించింది. గత సార్వత్రిక ఎన్నికలలో చెప్పుకోతగ్గ ఓట్లు అత్తెసరు బేరాలతో కాసిన్ని సీట్లు సాదించింది. ఇంకేముంది ఇక 2019లో దక్షిణాన కూడా కాషాయం పులిమేస్తం అంటూ.. అనుకుంటూ కలల లోకంలో విహరించారు కాషాయ నాయకులూ.. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే కథంతా మారిపోయింది.

ఇప్పటివరకు అంతంత మాత్రం ఓట్లు, సీట్లు సంపాదించినా బిజేపికి రానున్న కాలం కష్టమే అనిపిస్తుంది. 2014 లో ఆదరించి అక్కున చేర్చుకున్న ఆంధ్ర రాష్టమే ఆరడుగుల గోతిలో ఇప్పుడు దాన్ని కప్పేసే పరిస్థితి వచ్చింది. “తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్నాడట వెనకటికి ఎవడో పిచ్చోడు”. అలాగే ఉంది ఇప్పుడు ఏపిలో కాషాయ పార్టీ పరిస్థితి. కారణాలు ఏమైనా  ఆంధ్రప్రదేశ్‌కి అనుకున్నంతా అయితే ఏమి ఇవ్వలేదు కేంద్రంలోని కమలం పార్టీ. అధికారం, ప్రతిపక్షం రెండు మన చేతిలోనే ఉన్నాయి మనం ఏం చేసినా నడుస్తుంది, మనం ఏం చెప్పినా వింటారని ఆంధ్రని లైట్ తీసుకున్నారు. కానీ ఆంధ్ర ప్రజలు మాత్రం తమకు ఇస్తాను అన్నవాటిని లైట్ తీసుకోలేదు, బిజేపి మీద పీకల దాక కోపంతో ఉన్నారు, ఈ విషయాన్నీ పసిగట్టిన టిడిపి, వైసిపి రెండు ఇప్పుడు బిజేపికి దూరంగా జరుగుతున్నాయి, అయితే టిడిపి లేకపోతే వైసిపి ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుని.. ఏదో ఒక తోక పట్టుకుని తోక పార్టీలాగా అయినా.. మెల్లిగా ఎదుగుదాంలే అనుకున్నారు కానీ అవసరం ఉన్నప్పుడు వాడుకుని అవసరం తీరాకా హోదా, ప్యాకేజీ ఏదీ ఇవ్వకుండా.. మమ్మల్ని మా రాష్టాన్ని మోసం చేశారని టిడిపి దూరం అవ్వాలని చూస్తుంటే, బిజెపితో కలిస్తే ఎక్కడ దళిత, మైనార్టీ ఓట్లు పోతాయో, ఎక్కడ టిడిపి, జనసేన కలిసి తనని ఉతికి అరెస్తారోనని.. జగన్ కూడా బిజెపిని దూరంగా ఉంచే ఆలోచనలో కూడా ఉన్నాడు. కానీ కేంద్రంలో వచ్చే మంత్రి పదవులకు ఆశపడి వీరిద్దరిలో ఎవరైనా ఈసారి ఎన్నికలలో బిజేపితో జట్టు కడితే.. వాళ్ళిద్దరికి కలిపి బ్యాండ్ మోగిస్తారు అమరపురి ప్రజలు. వీళ్ళు చాలదు అన్నట్లు పులి మీద పుట్రలా, ఏకు అనుకుంటే ఏకంగా ఏకు మేకై కూర్చునేందుకు రెడీ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. ప్యాకేజిలు పాచిపోయిన లడ్డూలు అంటూ బిజేపి మీద అప్రకటిత యుద్దానికి రెడీ అవుతున్నాడు జనసేనాని. ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఏపికి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజ్ ఇచ్చినా కూడా బిజెపికి ఓటు వేస్తారో లేదో చెప్పలేము. 2014 లో కాంగ్రెస్‌కి పట్టిన గతే ఇప్పుడు బిజేపికి పట్టనుంది. 
పోనీ తల్లిని చంపుకుని పిల్లని బ్రతికించుకుందామా అనుకుంటే.. తెలంగాణాలో అ పార్టీ పరిస్థితిని కుక్కలు చింపిన విస్తర చేసేశారు ఇక్కడ నాయకులూ. ఒకరితో ఇంకొకరికి పోసగాదు. వాళ్ళ గోల వాళ్ళదే కానీ ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యడానికి కూడా వీళ్లకి ఖాలీ ఉండదు. అప్పుడప్పుడు తెలంగాణా విమోచన దినానికి బిజేపి జెండాలు పట్టుకుని హాడావిడి చెయ్యడం తప్ప.. ఇక్కడ కాషాయ జెండా పాతడానికి ప్రయత్నించే నాయకుడే లేడు. అక్కడక్కడా బలంగా ఉన్న కాసిని సీట్లలో కూడా  సెంటిమెంట్ నింపి కారు వేగాన్ని పెంచి కబళించాలని చూస్తుంది గులాబీ దండు. హైదరాబాద్‌కి చేసింది ఏమి లేదు, ఇచ్చింది ఏమి లేదు అంటూ అవకాశం దొరికినప్పుడల్లా సెంటిమెంట్ లేపుతూ మెల్లగా బిజేపిని కబళిస్తున్నాడు కేసిఆర్. ఇక్కడ కూడా ఆశలు అడుగంటిపోయాయి అని అర్దమవడంతో ఇచ్చిన ఒక్క మంత్రి పదవికూడా వెనక్కు తీసుకుంది. ఇక తమిళనాడు సంగతి అయితే ఇంక చెప్పనక్కర్లేదు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అక్కడ బిజేపికి పట్టిందల్లా దరిద్రమే అన్నట్లు ఉంది పరిస్థితి. మొదట రజినీకాంత్‌కి వల వేశారు కుదరలేదు, జయ మరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకుందాం అనుకున్నారు పన్నీర్‌ని, పళనిని అడ్డం పెట్టుకుని శశికళని పక్కకు తప్పించి రాష్టంలో పరోక్ష ప్రభుత్వాన్ని నడుపుదాం అనుకున్నారు. కానీ అదీ బెడిసి కొట్టింది, అమ్మ తర్వాత అమ్మ అనుకున్న చిన్నమ్మని ఇంతలా వేధించడం అక్కడి ప్రజలకు నచ్చలేదు. అ కోపాన్ని ఆర్కే నగర్ ఉపఎన్నికలలో చూపించారు, బిజేపికి, డియంకెకి కలిపి పెద్ద షాక్ ఇచ్చి శశికళ వర్గాన్ని గెలిపించారు, దానికి తోడు జల్లికట్టు కోపం ఉండనే ఉంది. మొత్తానికి అక్కడ కూడా బిజెపితో జతకట్టే పార్టీ లేదు. ఒంటరిగా పోటి చేస్తే పట్టించుకునే నాదుడు లేడు. 
కేరళలో అయితే బిజేపికి చెప్పుకోడానికి కూడా ఒక్క పేరుమోసిన నాయకుడు లేడు, ఒకరు ఇద్దరు ఉన్నా అక్కడి కమ్యునిస్ట్ పార్టీలు అనుసరిస్తున్న “చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి” అనే సిద్ధాంతంతో ఎక్కడా బిజేపి గొంతు వినిపించినా దాన్ని నిర్దాక్ష్యణ్యంగా నొక్కేస్తున్నారు. యాక్టివ్‌గా ఉండే ఆర్ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, ఏబీవీపీ నాయకులని ఎంత దారుణంగా చంపుతున్నారో ఎవరికి తెలియనిది కాదు. ఇంకా ఎతా వాతా కాషాయ దండుకి మిగిలింది కర్ణాటక ఒక్కటే. సౌత్‌లో బిజేపి అధికారంలోకి వచ్చిన రాష్టం ఇదొక్కటే. కాంగ్రెస్‌కి అధికారంలో మిగిలి ఉన్న ఏకైక పెద్ద రాష్టం కూడా ఇదే. ఇక్కడ తిరిగి అధికారంలోకి రావాలని బిజేపి గట్టిగా కోరుకుంటోంది. కానీ ఈ రాష్టాన్ని కోల్పోవడానికి కాంగ్రెస్ సుముఖంగా లేదు. బిజెపి అధికారంలోకి రాకుండా ఉండటానికి అన్ని శక్తులు అడ్డం పెడుతుంది, ఇక్కడా కాషాయా పార్టీని అష్టదిగ్బంధనం చెయ్యడానికి గట్టిగానే వ్యూహారచన చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కి ఉంటె బీజేపీ ఓటు బ్యాంకు బీజేపీకి ఉంది. కానీ ఇక్కడే అసలు మెలిక ఉంది కర్ణాటక మొత్తంలో తెలుగు జనాభా 10 నుండి 15 శాతం ఉంది దిన్ని బ్రహ్మస్త్రంగా మలచుకుని బిజెపీని కోలుకోలేని దెబ్బకొట్టడానికి వ్యూహరచన చేస్తోంది కాంగ్రెస్.  
తెలుగు నాయకులని, తెలుగు హీరోలని తీసుకువచ్చి ఆంధ్రకి బిజేపి చేసిన అన్యాయాన్ని ఏకరువు పెట్టించి సెంటిమెంట్ రగిలించి తెలుగు ఓట్లని కాషాయ పార్టీకి దూరం చేయడానికి ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే తొలి అడుగు కూడా వేసేసింది. కర్ణాటకలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెగాస్టార్‌ని కర్ణాటక ఎన్నికలలో ప్రచారం చెయ్యడానికి ఒప్పించింది. జాతీయ పార్టీగా ఎదగాలి అని తాపత్రయ పడుతున్న తెలుగుదేశం కూడా భాజపాకి వ్యతిరేక కూటమితో జట్టు కడితే…? ఒక్కశాతం ఓట్లతో అధికార మార్పిడి జరిగే పరిస్థితి నెలకొన్న ఈ తరుణంలో 15 శాతం ఓట్లు వ్యతిరేకంగా పడితే అది కాషాయ పార్టీకి కోలుకోలేని దెబ్బే…
కధ ఇంతటితో ముగిసిపోలేదు ఇప్పటివరకు బిజేపి చేసిన తప్పులు ఒక ఎత్తు ఇప్పుడు చెయ్యబోతున్న తప్పు మరో ఎత్తు. ముందు వెనుక ఆలోచించకుండా మూర్ఖంగా ముందుకు వెళుతున్న మోడీ టీం 16 వ ఫైనాన్స్ కమిషన్ పేరుతో దక్షిణాది రాష్టాలకు ఇచ్చే నిధులలో కోత విధించే ఆలోచన చేస్తుంది, ఈ తప్పు కనుక చేస్తే ఇక దక్షిణాదిలో బిజేపి అధికారం మాట దేవుడెరుగు.. కనీసం డిపాజిట్లు కూడా సంపాదించుకోలేదు. ఇప్పటికి అయినా పోయింది ఏమి లేదు రాజకీయ లెక్కలు పక్కన పెట్టి దక్షిణాది రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ నటించకుండా తన పేరుకి తగినట్లుగా.. భారతీయ జనతా పార్టీగా మెలిగి (ఉత్తరాది, దక్షిణాది అని తేడా చూపించకుండా) నిజంగా నిజాయితీగా ప్రయత్నిస్తే ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో పది పదిహేను సంవత్సరాలకి అయిన దక్షిణాదిలో పాగా వేసే అవకాశం వస్తుంది. కాదు కూడదు అని అలాగే మూర్ఖంగా చేస్తే మాత్రం ఎందరు మోడీలు వచ్చి “ఢీ” కొట్టినా దక్షిణాది ప్రాంతీయ పార్టీల ముందు తల వంచక తప్పదు.