అవిశ్వాసంతో ఆంధ్రకి ఒరిగేది ఏంటి?

What Andhra Pradesh Gets With Avishwasam
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రలో ఇప్పుడు అవిశ్వాస రాజకీయం నడుస్తోంది. మొదట జే.యఫ్.సి ఈ బంతిని చంద్రబాబుకి వెస్తే దాన్ని తెలివిగా జగన్ కోర్ట్ లోకి పంపారు బాబు. సవాల్‌కి సిద్దం అంటూ దాన్ని జగన్.. పవన్ కోర్ట్ లోకి పంపితే ఉహించని వేగంతో పవన్ చాలెంజ్ కి సై అంటూ అవిశ్వాసం బంతిని తిరిగి జగన్ కోర్ట్ లోకి కొట్టాడు పవన్. దీంతో అవిశ్వాసం ఆట మహారంజుగా మారింది.అబ్బా హోదా పోరులో జోరు పెరిగింది అని జనం అనుకుంటున్నారు కానీ వీళ్ళు పెట్టె అవిశ్వాసంతో ఆంధ్రకి ఒరిగేది ఏమైనా ఉందా? 

కేంద్రంపై ప్రజలకి ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోడానికి ఆంధ్ర పార్టీలు ఆడే మరో పొలిటకల్ డ్రామా అని కొందరి వాదన. కాదు దీనితో ఆంధ్రకి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందనేది మరికొందరి వాదన. రెండింటిలోను ఎంతో కొంత నిజం అయితే ఉంది. సరే డ్రామా విషయం పక్కన పెడితే అవిశ్వాసంతో ప్రయోజనం ఎంత? దానితో ఆంధ్రకి హోదా కానీ ప్యాకేజి కానీ వస్తుందా..? అంటే వస్తుంది అని చెప్పలేము. కానీ ఆంధ్రకి న్యాయంగా రావలసిన కొన్ని ప్రయోజనాలు అయితే చట్టబద్దంగా తెచ్చుకునే అవకాశం వస్తుంది. ఎలా అంటే అవిశ్వాసం కనుక సభ ముందుకు వస్తే ముందు చర్చ నడుస్తుంది. ఇప్పటివరకు ఆంధ్ర విభజన సమస్యలపై పార్లమెంట్ లో అర్ధవంతమైన చర్చ నడవలేదు అంటే ఎవరైనా నమ్మగలరా? ఇప్పుడు అ చర్చ నడిచే అవకాశం వస్తుంది. అప్పుడు అందరు కలిసి కేంద్రాన్ని నిలదీయవచ్చు. హోదా లేదా ప్యాకేజ్ గురించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హోదా కుదరదు ప్యాకేజినే అని అంటే దానికి చట్టపరమైన ఆమోదం కావాలని పట్టుబడితే బిజేపి సెల్ఫ్ డిఫెన్స్ లో పడుతుంది. బిజెపిని కార్నర్ చేసే అవకాశం వస్తుంది కనుక కాంగ్రెస్ కూడా ఇందులో బాగం అవుతుంది. చట్టసభలో స్పష్టమైన హామీ లేదా చట్టపరమైన ప్యాకేజి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి హామీ లేదా చట్టం చెయ్యకుండా తప్పించుకోవాలి అని బిజేపి చూస్తే మాత్రం పార్లమెంట్ సాక్షిగా బిజేపి ఆంధ్ర జాతికి చేసిన ద్రోహాన్ని మొత్తం దేశం అంతా చూస్తుంది. లోక్ సభ సాక్షిగా బిజేపి తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది.  
ఇదే కనుక జరిగితే మోడీ ఆగ్రహంతో రగిలిపోతారు. ఖచ్చితంగా దినికి కారణం అయిన పార్టీలని వదిలి పెట్టడు. అందుకే నువ్వు పెట్టు అంటే నువ్వు పెట్టు అంటూ అవిశ్వాసం బంతిని ఒకరి కోర్ట్ లో నుండి ఇంకొకరి కోర్ట్ లోకి తోసుకుంటూన్నాయి టిడిపి, వైసిపిలు. తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోడానికి ఈ అవిశ్వాస డ్రామాని.. కొన్ని రోజులు ఆడించి ఆ సమయానికి వెనక్కు తగ్గుతాయా..? లేక ప్రజా ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరుకి సై అంటాయా..? అనేది వేచి చూడాల్సిందే.