బెంగళూరులో పేలుళ్ల కలకలం రేపింది. ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీ గొడౌన్లో పేలుడు సంభవించింది. చామరాజ్పేట్లోని రాయన్ సర్కిల్ వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది గాయపడ్డారు. వీరిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు గల కారణం తెలియాల్సి ఉంది. ప్రమాదం తీవత్రకు మృతదేహాలు తునాతునకలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెండు ఫైరింజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.
అయితే, పంక్చర్ షాపులో కంప్రెజర్ పేలుడుకు కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. గాయపడినవారిని చికిత్స కోసం విక్టోరియా ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో పంక్చర్ షాపు యజమాని మృతిచెందినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది. ఘటనపై కేసు నమోదుచేసిన వీవీ పురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పేలుడు ధాటికి పదికిపైగా వాహనాలు ధ్వంసమయినట్టు వెల్లడించారు.
బెంగళూరు నగర డీసీపీ (దక్షిణ) హరీశ్ పాండే మాట్లాడుతూ.. పేలుడుకు ఖచ్చితమై కారణం ఏంటో తెలియదని అన్నారు. ‘అయితే, ప్రాథమిక నివేదికల ప్రకారం ట్రాన్స్పోర్ట్ సంస్థ పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్టు తెలుస్తోంది.. వాటిని బాణాసంచాగా భావిస్తున్నామని అన్నారు.. కానీ, ఇది కేవలం అనుమానం మాత్రమేనని దీనిపై మరింత లోతుగా విచారించాల్సి ఉంది’ అని అన్నారు. దర్యాప్తులో వాస్తవాలు బయటపడతాయని ఆయన తెలిపారు.