శ్రీలంకలో మరో పేలుడు

శ్రీలంకను పేలుళ్లు ఇంకా వణికిస్తున్నాయి. తాజాగా కొలంబోకు 40 కిలోమీటర్ల దూరంలోని పుగోడాలో గురువారం (ఏప్రిల్ 25) ఉదయం బాంబు పేలుడు చోటుచేసుకుంది. అయితే.. బాంబు పేలిన ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పుగోడాలోని మెజిస్ట్రేట్‌ కోర్టుకు వెనుకాల ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఇది గత రెండు రోజులుగా జరిగినట్లు నియంత్రిత పేలుడు (నిర్వీర్యం చేయడంలో భాగంగా జరిపేది) కాదని అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలుళ్ల నేపథ్యంలో హై అలర్ట్ విధించిన పోలీసులు 58 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొలంబో నగరాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఓ చర్చి వెలుపల నిలిపి ఉంచిన వ్యాన్‌లో, బుధవారం ఓ సినిమా థియేటర్ వద్ద నిలిపి ఉంచిన సైకిల్ వద్ద బాంబును గుర్తించారు. వీటిని నిర్వీర్యం చేసే క్రమంలో అధికారులు నియంత్రిత పేలుడు జరిపారు. కొలంబోలో ఉగ్రవాదులు మొత్తం 8 చోట్ల పేలుళ్లకు పాల్పడ్డారు. వీటిలో ఆరు చోట్ల ఆత్మాహుతి దాడులు చేశారు. ఆత్మాహుతి దాడుల్లో మొత్తం 9 మంది పాల్గొన్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. న్యూజిలాండ్‌లోని మసీదుల్లో కాల్పుల ఘటనకు ప్రతీకారంగా కొలంబో పేలుళ్లు జరిపినట్లు శ్రీలంక రక్షణ మంత్రి ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటించారు. కొలంబో పేలుళ్లకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.