మోడల్, బాడీ బిల్డర్, సెలబ్రిటీల ఫిట్‌నెస్ ట్రైనర్ సత్నాం ఖత్రా(31) హఠాత్తుగా మరణించారు. శనివారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన ప్రాణాలు విడిచినట్లు అతని కోచ్ రోహిష్ ఖేరా వెల్లడించారు. ఆయన మరణం సినిమా పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. 1989లో పంజాబ్‌లోని భాడ్సన్‌లో ఓ గ్రామంలో సత్నాం ఖత్రా జన్మించారు.
మెలితిరిగిన కండలతో వీరుడిగా కనిపించే ఆయన మోడల్‌గా రాణించారు. ఖత్రా ఫిట్‌నెస్ క్లబ్‌కు ఫిట్‌నెస్ కోచ్‌గా వ్యవహరించేవారు, ఎందరో సెలబ్రిటీలకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేశారు. అదే సమయంలో డ్రగ్స్ బారిన పడ్డారు. ఈ విషయం తెలిసి అతని కుటుంబ సభ్యులు వెంటనే సత్నాంను డీ అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స తీసుకుని రికవరీ అయిన సత్నాం మాదక ద్రవ్యాలకు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత మరింత ఫోకస్‌తో తన వృత్తిలో తిరిగి చేరారు.
ఈ సందర్భంగా శారీరక వ్యాయామం చేయాలని చెప్తూనే డ్రగ్స్ వంటి అనారోగ్యాన్ని కలిగించే అలవాట్లను మానుకోవాలని యువతకు సందేశమిచ్చేవారు. త్వరలోనే ఆయన స్వంత బ్రాండ్‌తో ఫిట్‌నెస్ ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేశారు. ఇంతలోనే ఆయన అకాల మరణం చెందడం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగు లక్షలకు పైగా ఫాలోయర్లను సంపాదించుకున్న సత్నాం మరణంపై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఫిట్‌నెస్ ఉన్న వ్యక్తికి గుండెపోటు రావడమేంటని సందేహాలు వెలిబుచ్చుతున్నారు. డ్రగ్స్ మాఫియానే అతని చావుకు కారణమయ్యుంటుందా? అని చర్చిస్తున్నారు.