నేటి నుండే బోనాలు….గోల్కొండ ఆలయానికి మంత్రులు

bonalu starts from today

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దంలాంటి బోనాల జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. గోల్కొండలోని జగదాంబిక మహంకాళి ఆలయం నుంచి బోనాల జాతరను తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్ర కరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్ ప్రారంభించనున్నారు. ఈ మంత్రులు అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌజ్ నుంచి అమ్మవారి రథం, తొట్టెల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటలోని ఆలయం వరకు రానుంది. చోటాబజార్‌ లో పూజారి అనంతచారి ఇంట్లో నుంచి నగలను తీసుకెళ్లి అమ్మవారికి అలంకరిస్తారు. ఆలయ ఛైర్మన్ గోపిరెడ్డి వసంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బోనాల ఏర్పాట్లను ఘనంగా చేశారు. బోనాల జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఖర్చుకు వెనకాడకుండా ఘనంగా నిర్వహిస్తున్నారు. బోనాల జాతర ఏర్పాట్లపై సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ ఆవరణలో నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ లో బోనాల ఏర్పాట్ల కోసం అన్ని శాఖలు కలిపి రూ.100కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహిస్తారట.