తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను దశదిశలా చాటేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు పొట్టేల్ శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ఈ నెల 14న ఏపీలోని విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నామని తెలిపారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని కోరుతూ బుధవారం ఆయన ఏపీ సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. సీఎస్‌ను కలిసినవారిలో ఉమ్మడి దేవాలయాల మాజీ అధ్యక్షుడు గాజుల అంజయ్యతోపాటు కమిటీ సభ్యులు ప్యారసాని వెంకటేశ్ తదితరులు ఉన్నారు. ఆషాఢమాస బోనాల సందర్భంగా పాతనగరంలోని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సప్త మాతృలకు బంగారు బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. అందులోభాగంగా గురువారం గోల్కొండ కోటలో వెలసిన జగదాంబ అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నామని వెల్లడించారు.