అప్పటి మంత్రుల భజనే కొంప ముంచింది : బొండా ఉమా

Bonda uma says that ministers bhajan house drownde

ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీ లోపాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడ టీడీపీ నేత బోండా ఉమ కాస్తంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అప్పటి మంత్రుల్లో కొందరు ఓ భజన బృందంలా తయారయ్యారని ఆరోపించారు. ప్రతి చిన్న విషయానికీ భజన చేసి చంద్రబాబుకు నిజాలు తెలియకుండా చేశారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అధినేత దృష్టికి తీసుకెళ్లలేదని, కార్యకర్తలను చంద్రబాబుకు దూరం చేశారని దుయ్యబట్టారు. దానికితోడు, ప్రశాంత్ కిశోర్ టీమ్ రూపొందించిన ‘ఒక్క చాన్స్’ నినాదం కూడా టీడీపీకి వ్యతిరేకంగా మారిందని బొండా ఉమ చెప్పుకొచ్చారు. టీడీపీ సర్కారు పెన్షన్లు పెంపుదల చేసినా ‘ఒక్క చాన్స్’ నినాదం ముందు అది పనిచేయలేదని తెలిపారు. ఇక అప్పటి మంత్రులు కొంతమది.. ప్రతి చిన్న విషయానికి భజన చేసి పార్టీని ఈ పరిస్థితికి తీసుకురావడానికి కారణమయ్యారని వ్యాఖ్యానించారు. జరుగుతున్న వాస్తవాలను అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లనీయకుండా, తీసుకెళ్లకుండా.. కార్యకర్తల అభిప్రాయాలను కూడా ఆయనకు తెలియకుండా చేశారన్నారు. ప్రతీదానికి భజన చేశారని చెప్పుకొచ్చారు. ఇది కూడా తమ ఓటమికి ఓ కారణంగా చెప్పారు. ఇటు కాపు నేతల సమావేశంపై కూడా స్పందించారు. తాము పార్టీ మారతామని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు.