తమిళనాడుకు చెందిన బూమ్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ బైక్ కార్బెట్ ను విడుదల చేసింది. కంపెనీ ఈ మోడల్‌ను ‘భారతదేశం అత్యంత మన్నికైన, దీర్ఘకాలిక ఎలక్ట్రిక్ బైక్’గా పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ బైకులో 2.3 కిడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంది. కావాలంటే దీనిని 4.6 కిహెచ్ డబ్ల్యు సామర్థ్యంకు రెట్టింపు చేసుకోవచ్చు. ఈ బైకును ఒకసారి ఫుల్ల చార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. దీనిలోని బ్యాటరీలను మార్చుకోవచ్చు. వీటితో పోర్టబుల్ ఛార్జర్ కూడా వస్తుంది.
సాధారణంగా ఇంట్లో ఉపయోగించే 15ఏ సాకెట్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. దీని గరిష్ఠ వేగం గంటకు 75 కిలోమీటర్లు. ఇది అత్యధికంగా 200 కిలోల లోడ్ మోయగలదు. మన దేశంలోని కఠినమైన రోడ్లకు తగ్గట్టు దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వాహనం బ్యాటరీ ఫుల్ ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్. కంపెనీ ప్రస్తుతం బ్యాటరీపై 5 సంవత్సరాల వారెంటీని, వాహనంపై 7 సంవత్సరాల వారెంటీని అందిస్తోంది. కొనుగోలు కోసం 5 సంవత్సరాల ఈఎమ్ఐ ప్లాన్ కూడా అందిస్తోంది.
దీనిని బుక్ చేసుకోవడానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రెండు మోడల్స్ ఉన్నాయి. 100 కిమీ దూరం వెళ్లే కార్బెట్ 14 మోడల్ బైక్ ధర వచ్చేసి రూ.86,999గా ఉంటే, 200 కిమీ దూరం వెళ్లే కార్బెట్ 14 ఈఎక్స్ బైక్ ధర రూ.1,19,999గా ఉంది. ఇందులో సీఓ2 ఆఫ్ సెట్ ట్రాకింగ్, యాక్సిడెంట్/థెఫ్ట్ డిటెక్షన్, పేరెంటల్ మోడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు జనవరి 2022 నుంచి ప్రారంభమవుతాయి.