బాలుడి ప్రాణాలను బలికొన్న బోరుబావి……

తెలంగాణలోని మెదక్ జిల్లాలో బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలు సాయివర్థన్ మృతి చెందాడు. మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో నిన్న సాయంత్రం బోరుబావిలో పడిన బాలుడి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 17 అడుగుల లోతులో చిక్కుకుపోయిన బాలుడిని సురక్షితంగా వెలికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 12 గంటలపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు.

అలాగే.. బావికి సమాంతరంగా పొక్లెయిన్లతో గొయ్యి తవ్వి బాలుడిని వెలికి తీశారు. అయితే.. అప్పటికే బాలుడు మృతి చెందాడు. కాగా సాయివర్ధన్ మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో తల్లిదండ్రుల శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామం అంతటా విషాద ఛాయలు అలముకున్నాయి.

 కాగా పంటపొలంలో బోరుబావి వేసిన అరగంటకే సాయివర్ధన్ అందులో పడిపోయి మృతి చెందడం సర్వత్రా కలకలం రేపుతోంది. పొలం వద్ద ఎవరి పనుల్లో వారుండగా ఆడుకుంటూ వెళ్లిన సాయివర్ధన్ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనా దీప్తి, ఆర్డీవో సాయిరాం ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను దగ్గరుండి చూశారు. బాలుడి ప్రాణాలను కాపాడేందుకు 12 గంటలపాటు శ్రమించారు..కానీ ఫలితం లేకుండా పోయింది. బాలుడు విగతజీవిగా బయటకు రావడం చూసి అంతా బోరుమని విలపించారు.